- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెదపేట దాడుల కేసులో 21 మంది అరెస్ట్.. పరారీలో మరో 36 మంది నిందితులు
పెదపేట దాడుల కేసులో 21 మంది అరెస్ట్. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పర్యటనలో ఉద్రిక్తత.. గ్రామంలో 144 సెక్షన్ అమలు, పోలీసుల భారీ నిఘా.

దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో చోటుచేసుకున్న దాడుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ దాడి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో 36 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వ్యతిరేక వర్గం అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. ఆయన ఆలయంలో రాముడి విగ్రహానికి దండ వేస్తుండగా అడ్డగించిన ప్రత్యర్థులు, అనంతరం జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన కూటమి నేతలపై రాళ్లతో దాడికి తెగబడ్డారు.
ఈ ఘటనలో పలువురు కూటమి కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పెదపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పేద పేట రామాలయం పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించి, భారీగా పోలీసు బలగాలను మోహరించారు. గ్రామంలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. రఘురామకృష్ణంరాజు పర్యటనను అడ్డుకోవడం, తదనంతర దాడుల నేపథ్యంలో గ్రామంలో మళ్ళీ ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు డేగ కన్నుతో నిఘా ఉంచారు. నిందితులందరికీ కఠినంగా శిక్షిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.






