ముత్తాత సమాధి కోసం 19 ఏళ్లుగా వెతుకులాట.. ఇంగ్లండ్ టు హైదరాబాద్

by Muthe.Rajitha |

130 ఏళ్ల కిందటి తన ముత్తాత సమాధిని వెతుకుతూ 19 సంవత్సరాల పాటు సాగిన రాబిన్ డిక్సన్ అన్వేషణ విజయవంతం అయింది.

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్లుగా వెతుకులాట.. ఇంగ్లండ్ టు హైదరాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ, అనుబంధాలకు నిజంగా సరిహద్దులు ఉండవు అన్న మాటను నిజం చేసిన ఘటన ఇది. 130 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఓ బ్రిటిష్ పౌరుడు ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 19 సంవత్సరాల పాటు సాగిన అన్వేషణ చివరికి విజయవంతం అయింది. ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లో ఉన్న పాత దస్త్రాలను పరిశీలిస్తూ ఉండగా, తన ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించినట్లు తెలిసింది. చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగళూరు, మద్రాస్ ప్రాంతాల్లో సేవలు అందించారు. తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 48 సంవత్సరాలు.

అయితే ఆయన సమాధి ఎక్కడ ఉందో కుటుంబానికి స్పష్టమైన సమాచారం లేదు. దీంతో రాబిన్ డిక్సన్ తన ముత్తాత సమాధిని కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగించారు. పాత రికార్డులు, చర్చిలు, సమాధి స్థలాల వివరాలు వెతికారు. ఈ క్రమంలో స్థానిక రిపోర్టర్ సహాయంతో.. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి 'సెమెట్రీ-12'లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు. ఈ వార్త తెలిసిన వెంటనే రాబిన్ డిక్సన్ తన భార్య లిన్‌తో కలిసి ప్రత్యేకంగా ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.

ముత్తాత సమాధి వద్ద తెల్ల గులాబీలు ఉంచి కన్నీటి నివాళులు అర్పించారు. "ఈ క్షణం కోసం ఎన్నేళ్లుగా ఎదురుచూశాను. ఇప్పుడు నా హృదయం సంతృప్తితో నిండిపోయింది" అని రాబిన్ భావోద్వేగానికి గురయ్యారు. తన 19 ఏళ్ల తమ వెతుకులాట ఫలించినందుకు, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కన్నీటి కృతజ్ఞతలు తెలిపాడు.

Next Story