- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ కూలీల పిల్లలకు యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు: వీసీ అల్దాస్ జానయ్య
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన, విస్తరణ అంశాలలో విశ్వవిద్యాలయం అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుందని ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బోధన, పరిశోధన, విస్తరణ అంశాలలో విశ్వవిద్యాలయం అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుందని ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. సోమవారం విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లలకు యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ప్రత్యేక కోటా సీట్ల ఫీజు రూ. 10 లక్షల నుంచి రూ. 5 లక్షలకు తగ్గించినట్లు తెలిపారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా 1200 గ్రామాల్లోకి వెళ్లి లక్షా 20 వేల మంది రైతులని నేరుగా కలిసామన్నారు. నూతనంగా కొడంగల్, నిజామాబాద్, హుజూర్ నగర్ లలో వ్యవసాయ కళాశాలలని ప్రారంభించామని, వెస్ట్రన్ సిడ్ని యూనివర్సిటీ సహా అనేక అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. దీంతో విశ్వవిద్యాలయం ర్యాంక్ 37 నుంచి 24 కు పెరిగిందని, ఐకార్, రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర సహకారం తో విశ్వవిద్యాలయాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ మెగా స్నాతకోత్సవంలో 2135 మంది అండర్ గ్రాడ్యూయేట్స్, 480 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్, 129 మందికి పీ హెచ్ డీ పట్టాలు అందచేశారు. ఆరుగురు పీ హెచ్ డీ అభ్యర్థులు, 26 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ , 64 మంది అండర్ గ్రాడ్యూయేట్స్ లకు బంగారు పతకాలు అందచేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంగం చేసిన అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ ప్రభు పింగళి కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. అనంతరం వారు ప్రసంగిస్తూ అత్యంత ప్రతిభాశాలి జానయ్య నేతృత్వంలో విశ్వవిద్యాలయం మంచి ప్రగతి సాధిస్తోందని అభినందించారు.
1960లలో ఆహార కొరత ఎదుర్కొన్న భారత దేశం హరిత విప్లవంతో నేడు ఆహార ఉత్పత్తులని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని వివరించారు. పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాల ఉత్పత్తి లో వెనుకబడి ఉన్నామన్నారు. ఈ కారణంగా అధిక సంఖ్యాక ప్రజలలో పౌష్టికాహార లోపం ఉందని అన్నారు. అదే విధంగా ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజల ఆహార అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయని, పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లు మన వారికి అలవడుతున్నాయన్నారు. అదే విధంగా కోవిడ్ తర్వాత డిజిటలీకరణ కారణంగా వివిధ యాప్ ల ద్వారా ఇంటి వద్దకే ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో సాగు పద్ధతులు, పంటల సరళి, విధానాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అధునాతన టెక్నాలజీలు, డిజిటల్ విధానాలని, విస్తరణ సేవలని సన్న, చిన్నకారు రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. పంటల వైవిధ్యకీరణ కి తోడ్పడే విధంగా వ్యవసాయ విధానాలు రూపొందించాలని సూచించారు. రవాణా, మార్కెటింగ్ వ్యవస్థ, నిల్వ సదుపాయాలలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు అధికం కావాలన్నారు. వినియోగదారుల ఆహారపు అలవాట్లకి అనుగుణంగా, ప్రజలకి పౌష్టికాహార భద్రత అందించే విధంగా ప్రణాళిక లు ఉండాలని ప్రభు పింగళి అభిప్రాయ పడ్డారు.






