- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమావాస్య ఎఫెక్ట్.. మొదటి రోజు భద్రాద్రిలో 13 శాతం విద్యార్థులు హాజరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరికొత్త విద్యా సంవత్సరం కాస్త నెమ్మదిగా, వింతైన వాతావరణంలో ప్రారంభమైంది.

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరికొత్త విద్యా సంవత్సరం కాస్త నెమ్మదిగా, వింతైన వాతావరణంలో ప్రారంభమైంది. వేసవి సెలవుల తర్వాత సోమవారం బడులు తెరుచుకున్నప్పటికీ, తరగతి గదులన్నీ వెలవెలబోయాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 44,095 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 5,540 మంది మాత్రమే స్కూళ్ల బాట పట్టారు. అంటే తొలిరోజు కేవలం 13 శాతం హాజరు మాత్రమే నమోదైంది. దీనికి కారణం ఎండ తీవ్రత అనుకుంటే పొరపాటే. అసలు కారణం "అమావాస్య ఎఫెక్ట్".
వెలవెలబోయిన తరగతి గదులు..
సాధారణంగా జూన్ నెలలో బడులు తెరిచే మొదటిరోజు సందడి సందడిగా ఉంటుంది. కొత్త పుస్తకాలు, కొత్త క్లాస్ రూమ్‌లు, స్నేహితుల పలకరింపులతో పాఠశాలలు కళకళలాడుతుంటాయి. కానీ ఈసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీన్ రివర్స్ అయింది. జిల్లాలోని మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నా, విద్యార్థులు లేక బెంచీలన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి.
సెంటిమెంట్‌కు తలవంచిన అక్షరాస్యులు..
ఈరోజు అమావాస్య కావడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ తల్లిదండ్రులు ఒక బలమైన సెంటిమెంట్‌ను నమ్మారు. అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించకూడదని, ముఖ్యంగా పిల్లలను మొదటి రోజు బడికి పంపడం మంచిది కాదనే నమ్మకంతో చాలామంది తమ పిల్లలను ఇంట్లోనే ఉంచేశారు. "తొలి రోజు మంచి ముహూర్తంలో అడుగుపెడితేనే చదువు బాగా వస్తుందని, అమావాస్య రోజు పంపితే కలిసిరాదనే" భావనతోనే 87 శాతం మంది విద్యార్థులు బడికి దూరంగా ఉన్నారు.
రేపటి నుంచి అసలైన సందడి..
తొలిరోజు అమావాస్య సెంటిమెంట్‌తో క్లాస్ రూమ్‌లు ఖాళీగా కనిపించినా, రేపటి (మంగళవారం) నుంచి బడులు పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి. అమావాస్య వెళ్లిపోవడంతో రేపటి నుంచి విద్యార్థులందరూ పాఠశాలలకు వస్తారని, విద్యాసంవత్సరం వేగంగా పుంజుకుంటుందని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా.. టెక్నాలజీ యుగంలోనూ చదువుల పండుగ పై 'అమావాస్య సెంటిమెంట్' ఈ స్థాయిలో ప్రభావం చూపడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.






