TG: మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల 2,996 వార్డులకుగాను 20,313 మంది నామినేషన్లు దాఖలు చేస్తే పరిశీలన తర్వాత 19,694 నామినేషన్లకు చేరింది.

TG: మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల 2,996 వార్డులకుగాను 20,313 మంది నామినేషన్లు దాఖలు చేస్తే పరిశీలన తర్వాత 19,694 నామినేషన్లకు చేరింది. అయితే వీరిలో 6701 మంది అభ్యర్థులను తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో 12,993 మంది అభ్యర్థులు ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులను సైతం కేటాయించారు. ఎన్నికల ప్రక్రియలో 25శాతం పని పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎన్నికల నిర్వహణలో కీలక అంశమైన పోలింగ్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి అధికారులు కసర్తుత చేస్తున్నారు. పోలింగ్ కు అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్సుల కేటాయింపు, పోలీసు బందో బస్తుపై అధికారులు దృష్టి పెట్టారు.

52.43లక్షల ఓటర్లు..

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 2,996 వార్డులు ఉన్నాయి. మొత్తం 52.43లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25.62లక్షలు, మహిళలు 26.80లక్షలు, ఇతరులు 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరికిగాను 8,203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

50శాతం మహిళలకే..

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డుల్లో కేటగిరీల వారీగా కేటాయించారు. బీసీ జనరల్ 463, బీసీ మహిళా 391, ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళా 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళా 40 వార్డులు కేటాయించారు. వీరితో రిజర్వుకానివి 647, రిజర్వు కానివి(మహిళ) 864 వార్డులు ఉన్నాయి. వీటిలో మహిళలకు 50శాతం అంటే 1,485 వార్డులను కేటాయించారు.

90వేల మంది సిబ్బంది…

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సుమారు 90వేల మంది సిబ్బంది అవసరముంటుందని అధికారులు అంచనా వేశారు. వీరిలో పోలీసులే 25వేల మంది ఉన్నాారు. అడిషనల్ ప్రిసైండింగ్ ఆఫీసర్లు 31,428మంది ఉన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు 1,379మంది, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆపీసర్లు 1,547 మంది ఉన్నారు. వీరితోపాటు జోనల్ ఆఫీసర్లు 742 ఉన్నారు. ఎఫ్ఎస్టీ టీమ్స్ 279, ఎస్ఎస్టీ టీమ్స్ 381లలో కనీసం ముగ్గురు సిబ్బంది ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

బ్యాలెట్ బాక్సులు 16,031..

ఈ ఎన్నికల్లో 2,996వార్డులకు పోటిచేసే అభ్యర్థుల 15వేలకుపైగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కోవార్డులో అభ్యర్థులతోపాటు నోటా కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఎన్నికల్లో 16,031 బ్యాలెట్ బాక్సులను వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటికోసం 137 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన 136 కేంద్రాల్లోకి బ్యాలెట్ బాక్సులను పంపించనున్నారు.

Next Story