- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అభ్యర్థిపై 119 క్రిమినల్ కేసులు!
బెంగాల్ లోని నొవపాడా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు పెద్ద చర్చకు దారితీశాయి.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ లోని నొవపాడా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అర్జున్ సింగ్ తన నామినేషన్ అఫిడవిట్లో తనపై 119 క్రిమినల్ కేసులున్నట్టు పేర్కొన్నారు. అయితే గత ఎన్నికలలో కేవలం 24 కేసులు ఉండగా, ప్రస్తుత ఎన్నికల నాటికి ఆ సంఖ్య ఏకంగా 119కి చేరింది.
అర్జున్ సింగ్ రాజకీయ ప్రస్థానం గమనిస్తే.. ఆయన బెంగాల్ రాజకీయాల్లో ఒక 'ఫ్లోటింగ్ లీడర్'గా పేరు తెచ్చుకున్నారు. మొదట తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరి భాట్పారా నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో తొలిసారి బీజేపీలో చేరి బ్యారక్పుర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2022లో మళ్లీ టీఎంసీ గూటికి చేరారు. అయితే, 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో, తీవ్ర అసంతృప్తికి లోనై మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రస్తుతం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నొవపాడా స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అర్జున్ సింగ్ పార్టీలు మారుతుండటం, వందకు పైగా కేసులు ఉండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సరళిని బట్టి చూస్తే, ఇలాంటి కేసులు అక్కడ అభ్యర్థులకు కొత్తేమీ కానప్పటికీ, ఏకంగా 119 క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం.






