- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర వర్సిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్
విద్యాశాఖ కార్యదర్శి, యూనివర్శిటీల వీసీలతో ఉన్నత విద్యా మండలి సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రవేశాలను మెరుగుపరచడం, గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ముందంజలో నిలపడమే లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) కార్యాలయంలో ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, ఉన్నత విద్యను కేవలం ఆలోచనల స్థాయికే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేసేలా ఈ 100 రోజుల ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి విశ్వవిద్యాలయాలు ముందస్తుగా సిద్ధం కావాలని, పాలనా సామర్థ్యం, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారించాలని ఆయన వీసీలకు సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ రైజింగ్ తెలంగాణ 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో యూనివర్శిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. దీనికి ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ, విద్యా ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించాలని తెలిపారు.
ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇంటర్న్ షిప్ గ్రిడ్:
వికసిత్ భారత్ 2047, వైబ్రెంట్ తెలంగాణ 2047 లక్ష్యాలకు అనుగుణంగా యూనివర్శిటీలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రతి యూనివర్శిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాలని, డిజిటల్ లెర్నింగ్, ఎంఓఓసీఎస్ కోర్సులను పెంచాలని వీసీలకు సూచించారు. విద్యార్థులకు కేవలం థియరీ మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం యూనిఫైడ్ ఇంటర్న్‌షిప్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కోర్సుల్లో మార్పులు చేస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్ తరహాలోనే, విద్యాసంస్థలు సమాజానికి తోడ్పడేలా అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(ఏఎస్ఆర్) ని ప్రోత్సహించనున్నారు.
ప్రతి వర్సిటీలో ప్రత్యేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసి, వినూత్న ఆవిష్కరణలకు వేదికగా మార్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు తమ 100 రోజుల ప్రణాళికలను సమర్పించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, టీజీసీహెచ్ఈ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇ. పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్.కె. మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్శిటీ సహా, పదికి పైగా వర్సిటీల విసిలు పాల్గొన్నారు.






