విమానం కుప్పకూలి 10 మంది మృతి

by Malleboina Mahesh |

బహామాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం కూలి 10 మంది మృతి.. 'ఫ్లెమింగో ఎయిర్' లైసెన్స్ తాత్కాలికంగా రద్దు!

విమానం కుప్పకూలి 10 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గాలిలో ఎగరాల్సిన ఓ మినీ విమానం నెలపై కుప్పకూలడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ షాకింగ్ సంఘటన బహామాస్ దేశంలో శనివారం సంభవించింది. సెస్నా 402 (Cessna 402) రకానికి చెందిన ఒక చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ భీకర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నాసావు నుండి శాన్ ఆండ్రోస్ ద్వీపానికి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై బహామాస్ ప్రధాన మంత్రి ఫిలిప్ బ్రేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

‘ఫ్లెమింగో ఎయిర్’ సర్వీసులు నిలిపివేత..

ప్రమాదం జరిగిన వెంటనే బహామాస్ విమానయాన రక్షణ, దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్వేషించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ప్రయాణికుల రక్షణ, ముందుజాగ్రత్త భద్రతా చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైన విమానాన్ని నడుపుతున్న 'ఫ్లెమింగో ఎయిర్' (Flamingo Air) విమాన సర్వీసుల లైసెన్స్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దర్యాప్తు పూర్తయి, భద్రతా ప్రమాణాలపై స్పష్టత వచ్చే వరకు ఆ సంస్థకు చెందిన ఎలాంటి సర్వీసులను అనుమతించేది లేదని విమానయాన అధికారులు స్పష్టం చేశారు.

Next Story