ఆంధ్రప్రదేశ్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు

by Malleboina Mahesh |

విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి ప్రారంభం.. త్వరలోనే దేశంలోనే 'డ్రోన్ హబ్'గా కర్నూలు నిలుస్తుందన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్!

ఆంధ్రప్రదేశ్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత రక్షణ మంద్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పై ప్రశంసలు కురిపంచారు. భారత రక్షణ రంగ బలోపేతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌లో అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ (INS Mahendragiri) కమిషనింగ్ (నావికాదళంలో చేరిక) వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఏపీ రక్షణ రంగ ప్రగతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది డ్రోన్ కంపెనీల కన్సార్టియంతో కర్నూలులో ఏర్పాటు కాబోతున్న ‘డ్రోన్ సిటీ’ (Drone City) గురించి ఆయన ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సూరత్, బెంగళూరు తరహాలోనే కర్నూలు డ్రోన్ హబ్

"ప్రపంచవ్యాప్తంగా సూరత్ నగరం ‘డైమండ్ సిటీ’గా, బెంగళూరు దేశానికి ‘సిలికాన్ వ్యాలీ’గా ఎలా గుర్తింపు పొందాయో.. అదే తరహాలో భవిష్యత్తులో కర్నూలు ప్రాంతం భారతదేశానికే తిరుగులేని ‘డ్రోన్ హబ్’ (Drone Hub) గా గుర్తింపు పొందుతుందని నేను బలంగా నమ్ముతున్నాను" అని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశంలో ప్రయాణించే దేశీయ యుద్ధ విమానం ‘ఏఎంసీఏ’ (AMCA), సముద్ర గర్భంలో పనిచేసే బీడీఎల్ (BDL) నావికాదళ వ్యవస్థలు, డ్రోన్ రంగంలో కర్నూలు దూకుడు, సముద్ర ఉపరితలంపై నేడు చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఇవన్నీ చూస్తుంటే అన్‌మ్యాన్డ్ (డ్రోన్) రంగం ఇలా ప్రతి విభాగంలోనూ భారతదేశ రక్షణ సామర్థ్యాలకు ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన సహకారాన్ని అందిస్తోందని కొనియాడారు. ఈ గొప్ప విజయానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రాంత ప్రజలకు రక్షణ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Next Story