యూపీలో అఖిలేష్ యాదవ్ వరాల జల్లు!

by Web Desk |

యూపీలో అఖిలేష్ యాదవ్ వరాల జల్లు!
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పేదలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు ఐదేండ్లు ప్రతి ఏటా ఉచిత రేషన్‌తో పాటు కేజీ నెయ్యి అందిస్తామని ప్రకటించారు. మంగళవారం రాయ్‌బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు ఉన్నాయనే ఉచిత రేషన్ గడువును మార్చి వరకు పొడగించిందని ఆరోపించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని తెలిపారు.

దీంతో పాటు ప్రతి ఏటా రెండు సిలిండర్లు, ఆవనూనె కూడా ఇస్తామని చెప్పారు. పేదలకు ఆరోగ్యాన్ని మెరుగు పడటానికి కిలో నెయ్యి కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ నాసిరకంగా ఉందని అన్నారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. బీజేపీ నేతలకు ఇంటింటి ప్రచారంలో నిరాశే ఎదురైందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోని ఖాళీ సిలిండర్లను చూపించారన్నారు. దీంతో వారు ఇంటింటి ప్రచారాన్నే నిలిపివేశారని విమర్శించారు. అయితే మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షా ర్యాలీలో బీజేపీ వచ్చే నెల 10న అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదే నిజమైతే హోలీకి రెండు రోజుల ముందే ఉచిత గ్యాస్ లబ్ధిదారుల ఇంటికి సరఫరా చేస్తామని చెప్పారు.

Next Story