కోవిద్ మరణాలు 2.21 కోట్లు : WHO

by Muthe.Rajitha |   (  Updated:2026-05-14 12:20:07  IST  )

ప్రపంచాన్ని వణికించిన కోవిద్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.

కోవిద్ మరణాలు 2.21 కోట్లు : WHO
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచాన్ని వణికించిన కోవిద్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కోవిద్ మహమ్మారి వలన ప్రపంచవ్యాప్తంగా 2.21 కోట్ల మంది మరణించారని తాజా ప్రకటనలో పేర్కొంది. అయితే గతంలో 70 లక్షల మరణాలు మాత్రమే సంభవించాయని తెలిపిన WHO.. తాజా అప్డేట్స్ తో వాటిని సవరించి ఈ నివేదిక విడుదల చేసింది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2.21 కోట్ల మంది మరణించినట్లు అంచనా వేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థల్లో ఉన్న లోపాలను కోవిడ్-19 మహమ్మారి బయటపెట్టిందని WHO పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా గత పదేళ్లుగా పెరిగిన సగటు జీవితకాలం (Life Expectancy) ఒక్కసారిగా పడిపోయిందని తెలిపింది.

అయితే ఈ పాండమిక్ అనంతరం కొన్ని సానుకూల అంశాలు నమోదైనట్టు WHO గుర్తించింది. కొత్తగా నమోదవుతున్న HIV కేసుల్లో 40% తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా ఆఫ్రికాలో 70% తగ్గుదల నమోదైందని పేర్కొంది. అలాగే పొగాకు, మద్యం వినియోగం గణనీయంగా తగ్గినట్టు తెలిపింది. అయితే ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది వైద్య ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 160 కోట్ల మంది వైద్య ఖర్చుల భారం భరించలేక పేదరికంలోకి నెట్టబడుతున్నారని వెల్లడించింది.

కాగా ఈ పరిణామాలపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. "ఈ గణాంకాలు పురోగతిని చూపిస్తున్నప్పటికీ, మహిళలు, పిల్లలు, వెనుకబడిన వర్గాలకు కనీస ఆరోగ్య పరిస్థితులు అందడం లేదనే నిజాన్ని కూడా చెబుతున్నాయి" అని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం, వ్యాధుల నివారణా చర్యలపై పెట్టుబడులు పెట్టడం ద్వారానే భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోగలమని నివేదిక స్పష్టం చేసారు.

Next Story