ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. వాటికంటే ఒక్క రూపాయి ఎక్కువున్నా నగదు సీజ్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-09 11:32:05  IST  )

కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల నగారా మోగించింది.

ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. వాటికంటే ఒక్క రూపాయి ఎక్కువున్నా నగదు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల నగారా మోగించింది. ఇవాళ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సీఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 3వ తారీకు వరకు ఎన్నికల నిబంధనలు అమలు కానున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలంగాణలో వెంటనే కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కోడ్ అమల్లోకి వచ్చిన అర గంటలోనే లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. అయితే కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి దగ్గర ఉండొచ్చు అనే దానిపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయి.

ఈసీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి దగ్గర రూ.50 వేలకు మించి నగదు ఉండకూడదు. అంతకంటే ఎక్కువగా ఒక్క రూపాయ ఉన్నా అధికారులు సీజ్ చేస్తారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వెంట తీసుకెళ్తే ఆ నగదు ఎక్కడిది..? ఎందుకు తీసుకెళ్తున్నారు అనే ఖచ్చితమైన ఆధారాలతోపాటు రసీదులు చూపించాలి. బంగారం, వెండి కొనుగోలు చేసినా బిల్లులు తప్పనిసరిగా చూపించాలి. కొనుగోళ్లు, అమ్మకాలు, ఆస్పత్రుల బిల్లుల చెల్లింపులకు సంబంధించిన నగదు అయినా వాటికి రసీదులు చూపించాల్సి ఉంటుంది. ఇకపై ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏ వ్యక్తి దగ్గర రూ.50 వేల నగదుకు మించి డబ్బులు ఉన్నా అధికారుల సీజ్ చేయనున్నారు.

Next Story