పాలేరు చిక్కుముడి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్

by Bhoopathi Nagaiah |

టీకాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక రోజు రోజుకు ఆసక్తి రేపుతున్నది. ఆశావహులు ఎక్కువ ఉన్న చోట్ల సీట్ల కేటాయింపు సంక్లిష్టంగా మారుతోంది.

పాలేరు చిక్కుముడి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక రోజు రోజుకు ఆసక్తి రేపుతున్నది. ఆశావహులు ఎక్కువ ఉన్న చోట్ల సీట్ల కేటాయింపు సంక్లిష్టంగా మారుతోంది. ఈ చిక్కుముడిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మక అడుగులు వేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టిన హస్తం అధిష్టానం ఆ మేరకు పక్కాగా ముందుకు వెళ్తోంది. టికెట్ల పంపకాల విషయంలో నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేసే స్థానం ఉత్కంఠగా మారింది. జిల్లాలో బలమైన నేతలుగా పేరున్న ఈ ఇరువురు పాలేరు టికెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు టికెట్ ఎవరికి దక్కబోతుందనేది పార్టీ కేడర్‌తో పాటు ప్రత్యర్థులలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పాలేరు టికెట్ విషయంలో మీరే తేల్చుకుని చెప్పాలని పొంగులేటి, తుమ్మలకు పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది.

ప్రత్యర్థులకు చాన్స్ లేకుండా వ్యూహం:

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానాలపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఇక్కడ బలమైన కేడర్‌తో పాటు పొంగులేటి, తుమ్మల వంటి నేతల చేరిక కాంగ్రెస్‌కు అదనపు బలంగా మారింది. తుమ్మల, పొంగులేటిలతో పాటు వీరి అనుచరులకు టికెట్ల విషయంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాలేరులో పొంగులేటికి, తుమ్మలకు చెప్పుకోదగిన కేడర్ ఉంది. దీంతో పాలేరు టికెట్ హాట్ కేక్‌గా మారిపోయింది. అయితే ఇద్దరు ఎఫెక్టివ్ లీడర్స్ కావడంతో పాలేరు టికెట్ పీఠముడిని పరిష్కరించుకునే బాధ్యతను అధిష్టానం వారికే వదిలేసినట్లు తెలుస్తోంది. పాలేరు టికెట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా వారి కేడర్ స్ప్లిట్ కాకుండా అనుచరుల టికెట్ల విషయంలోనూ ఏకాభిప్రాయం సాధించి ప్రతిపాదనలు పంపించాలని పొంగులేటి, తుమ్మలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కేడర్‌కు పొంగులేటి, తుమ్మల కేడర్ కలిసి వస్తే బీఆర్ఎస్‌కు చెక్ పెట్టడం మరింత సులభతరం అవుతుందని అందువల్ల ఈ విషయాన్ని అధిష్టానం వారికే వదిలేసినట్లు తెలుస్తోంది.

పొంగులేటి, తుమ్మల భేటీ!

అధిష్టానం నిర్ణయంతో పొంగులేటి, తుమ్మల భేటీ అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పోటీ చేయబోయే స్థానం, అనుచరుల టికెట్ల విషయంలో చర్చించి తమ ప్రతిపాదనలను అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మొత్తంగా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం సంక్లిష్టంగా ఉన్న స్థానాల విషయంలో చాన్స్ స్థానిక నేతల అభిప్రాయాలకే వదిలేయడం ఆసక్తిగా మారింది.

Next Story