తెలంగాణ ఎన్నికలపై ఫుల్ క్లారిటీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

by Javid Pasha |
తెలంగాణ ఎన్నికలపై ఫుల్ క్లారిటీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో.. తెలంగాణ ఎన్నికలపై కాస్త సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా? లేదా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్‌లో జరుగుతాయా? అనేది అనుమానంగా మారింది. రాజకీయ పార్టీలు మాత్రమే ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టాయి. అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను చేేపట్టడంతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెబుతున్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని, నవంబర్‌లో నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక డిసెంబర్‌లో ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారులను సీఈసీ నియమించగా.. ఎన్నికల నిర్వహణకు కూడా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 3న హైదరాబాద్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వస్తున్నారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.

తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లను సీఈసీ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. సీఎస్, డీజీపీ, రాష్ట్ర ఈసీ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో చర్చించనున్నారు. అలాగే ఎన్నికల్లో నగదు ప్రవాహన్ని కట్టడి చేయడంపై ఐటీ, జీఎస్టీ, బ్యాంకర్లతో భేటీ కానున్నారు. ఈసీ అధికారులు దూకుడు పెంచడం చూస్తుంటే వచ్చే నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed