డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క

by Disha Web Desk 2 |
డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్క ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. వీరి పేర్లనే దాదాపుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. రాత్రి 8.30 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఎస్సీ వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎస్టీ నుంచి సీతక్క డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం దర్బార్ హాల్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 175 మంది ఆసీనులయ్యే విధంగా అరేంజ్‌మెంట్స్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

జీఏడీకి సమాచారం

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్‌భవన్ సెక్రటేరియట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ప్రొటోకాల్ విభాగానికి చేరవేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి ఆదేశాలు సాయంత్రంలోగా రానున్నాయి. దీనికి అనుగుణంగా ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న డీకే శివకుమార్, మురళీధరన్, దీపాదాస్ మున్షీ తదితరులు హాజరు కానున్నారు.

వారికిచ్చే శాఖలివే..!

డిప్యూటీ సీఎంగా సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ సహా మరికొన్ని బాధ్యతలు దక్కనున్నాయి. మల్లు భట్టి విక్రమార్కకు ఫైనాన్స్, పౌర సరఫరాల శాఖలు కేటాయించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నా ప్రమాణ స్వీకారం తర్వాత పోర్టుఫోలియోలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనున్నది. మంత్రివర్గంలో కనీసంగా ఇద్దరికంటే ఎక్కువ మహిళలు ఉంటారని సమాచారం. మైనారిటీ కమ్యూనిటీ నుంచి షబ్బీర్ ఆలీకి అవకాశాలుండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన కేబినెట్ మంత్రులను ఖరారు చేయడంపై నాలుగైదు రోజుల్లో కసరత్తు పూర్తికానున్నది. ఈ నెల 9వ తేదీన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Read More..

రాత్రి 7 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణం!


Next Story