ఎన్నికల వేళ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఎన్నికల వేళ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మంచి సంబంధాలు ఉండాలని, కానీ దురదృష్టవశాత్తు చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సంబంధాలు దెబ్బతింటున్నాయని ప్రత్యేకంగా తెలంగాణలో అలాంటి సంబంధాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. గురువారం చెన్నైలో జరిగిన 'ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023'లో మాట్లాడిన తమిళిసై.. తెలంగాణ ఎన్నికలకు వెళ్లబోతున్నందున అన్ని విషయాలు నేను ఓపెన్‌గా చెప్పలేకపోతున్నాను. కానీ, గడిచిన మూడేళ్లుగా సీఎం తనను కలవలేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో కలవడం మినహా సీఎం తనను కలవలేదన్నారు. గవర్నర్ నిర్ణయాలను కొందరు రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారని ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు సీఎంలు ముందుకు రావాలన్నారు. మనం పంపించే ప్రతి ఫైల్ గవర్నర్లు సంతకం చేసి రబ్బరు స్టాంపులా పంపాలనే ఆలోచన రావడం సరికాదన్నారు.

చాలా మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ అవసరం ఉందని అంటారు. అధికారంలోకి రాగానే గవర్నర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నిస్తుంటారు. గవర్నర్ వ్యవస్థ రోడ్డుమీద స్పీడ్ బ్రేకర్ల లాంటిదని అవి ప్రమాదాల నుంచి కాపాడటానికే తప్ప ప్రమాదానికి కారణం కాదని అన్నారు. గవర్నర్ అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధి మాత్రమే కాదని ప్రజలకు కూడా వారధి అని అన్నారు. చాలా మంది ప్రజలతో గవర్నర్లు అప్యాయంగా ఉండటాన్ని తీవ్రంగా విమర్శిస్తారని వ్యాఖ్యానించారు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారం ఏది సరైనదో ఏది తప్పో నిర్ణయించుకోవాలన్నారు.

Next Story

Most Viewed