కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్.. వేములవాడ లీడర్ల వింత వైఖరి!

by Disha Web Desk 2 |
కేసీఆర్ ఆదేశాలు బేఖాతర్.. వేములవాడ లీడర్ల వింత వైఖరి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేములవాడ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను కాదని ఈసారి క్షేత్రస్థాయిలో పట్టున్న చలిమెడ లక్ష్మీనరసింహారావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచి వేములవాడ బీఆర్ఎస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రాజకీయం కొనసాగుతున్నది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చల్మెడకు సీటు కేటాయించడంపై చెన్నమనేని అప్పట్లో కొంత అసంతృప్తి చెందారు. ఇది గమనించిన కేసీఆర్.. టికెట్ నిరాకరించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరి కంటే ముందే చెన్నమనేనికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా టికెట్ ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో కేసీఆర్ వివరిస్తూ చలిమెడకు సహకరించాలని సూచించినట్లు తెలిసింది. కానీ, చెన్నమనేని మాత్రం చలిమెడకు సహకారం అందించే విషయంలో ఎడమొహం పెడమొహంతో వ్యవహరిస్తున్నారనే టాక్ నియోజకవర్గంలో గుప్పుమంటోంది. చల్మెడ కార్యక్రమాలకు చెన్నమనేని వర్గం దూరంగా ఉంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

మూడు ముక్కలాట..

ఇక, వేములవాడ టికెట్ ఆశించిన ఏనుగు మనోహర్ రెడ్డి సైతం టికెట్ దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. కేటీఆర్ విదేశాల నుంచి వచ్చాక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని మొదట్లో ప్రచారం జరిగినా విదేశాల నుంచి కేటీఆర్ తిరిగి వచ్చినప్పటికీ ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు. దీంతో ఏనుగు మనోహర్‌రెడ్డి సైతం చలిమెడ వర్గానికి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. దీంతో వేములవాడ బీఆర్ఎస్ రాజకీయం మూడుముక్కలాటగా మారిందనే చర్చ జరుగుతున్నది. ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరుతో కేడర్ కన్ఫ్యూజన్‌కు గురవుతున్నది.

ప్రజల్లోకి చలిమెడ..

పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నా కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో చలిమెడ ప్రజల్లోకి వెళ్తున్నారు. తండ్రి పేరుతో ఉన్న చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీతో ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న చలిమెడకు.. కరీంనగర్ జిల్లాలో మంచి పేరు ఉంది. ఇక వేములవాడ టికెట్ ఖరారు తర్వాత నియోజకవర్గం పరిధిలో అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. బిల్లుల పెండింగ్ ఉండటం కారణంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో కొందరు సపోర్ట్ చేసే విషయంలో నిమ్మకుండిపోతున్నారని చలిమెడ వర్గం భావిస్తోంది. అయితే కలిసి పనిచేసి పార్టీని గెలిపించాలని అధినేత ఆదేశించినా చెన్నమనేని సహకారం ఇవ్వకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story

Most Viewed