MP ప్రభాకర్‌ రెడ్డి కోలుకోడానికి చాలా టైం పడుతుంది: వైద్యులు

by Disha Web Desk 2 |
MP ప్రభాకర్‌ రెడ్డి కోలుకోడానికి చాలా టైం పడుతుంది: వైద్యులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కత్తి దాడికి గురైన దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి కోలుకోడానికి చాలా సమయం పడుతుందని, చిన్న పేగుకు నాలుగు చోట్ల లోతైన గాయం కావడంతో మూడు గంటలకు పైగా సర్జరీ చేశామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి వస్తుందని, ఆ తర్వాతనే కోలుకోడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టత వస్తుందని ట్రీట్‌మెంట్ అందించిన డాక్టర్ విజయకుమార్ తెలిపారు. దాడి జరిగిన తర్వాత గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స జరిగిందని, ఆ గాయంతోనే తమ ఆస్పత్రికి వచ్చారని, వెంటనే డాక్టర్ల బృందం ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టిందని తెలిపారు.

చిన్న పేగుకు బలమైన గాయం అయినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో వెంటనే సర్జరీ చేయాలనే నిర్ణయానికి వచ్చారని డాక్టర్ విజయకుమార్ తెలిపారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయడంలో ఉన్న ఇబ్బందులు, పరిమితులను దృష్టిల పెట్టుకుని జనరల్ సర్జరీ చేయక తప్పలేదన్నారు. కడుపులో చిన్న, పెద్ద పేగులు కలిపి మొత్తం 4 చోట్ల గాయమైందని, ఈ కారణంగానే సర్జరీ టైమ్‌లో చిన్న పేగులో 15 సె.మీ.ల మేర తొలగించామని వివరించారు. ఈ తరహాలో సర్జరీ జరిగిన తర్వాత రోగి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. దీనికి తోడు ప్రభాకర్‌రెడ్డికి హైపర్ టెన్షన్ సమస్య ఉందన్నారు. మెడికో లీగల్ కేస్ కావడంతో అన్ని శాంపిల్స్ సేకరించి భద్రపరిచినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాతే ఏ మేరకు కొలుకున్నారో చెప్పగలమన్నారు. అనంతరం వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు.

కత్తి గాయం 6 సెం.మీ. :

ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి బొడ్డుకి కుడి భాగంలో ఆరు సెంటీమీటర్ల మేర కత్తి గాటుతో గాయమైందని ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ ప్రసాదరావు తెలిపారు. సీ.టీ. స్కాన్‌ చేయడం ద్వారా శరీరం లోపల రక్తస్రావం అవుతునట్టు గుర్తించామన్నారు. చిన్న పేగుకి నాలుగు చోట్ల గాయమైందని, ‘కీ హోల్’ విధానం ద్వారా శస్త్ర చికిత్స చేయలేమనే అంచనాతో జనరల్ సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. తక్కువ సమయంలోనే ఆస్పత్రికి రావడంతో ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తలేదని, ప్రాణాపాయం నుంచి సేవ్ చేయగలిగామన్నారు. చిన్న పేగును 15 సెం.మీ.ల మేర తొలగించడంతో చిన్న కుట్లు వేశామన్నారు. కనీసంగా పది రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్నారు. దాదాపుగా మొత్తం వంద మంది వైద్యులు ఒక టీమ్‌గా వెంటనే స్పందించారని, గాయం చిన్నదే అయినా తీవ్రత, బ్లీడింగ్ కారణంగా ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.


Next Story