పదేళ్లుగా చెల్లింపులు సున్నా.. ప్రశ్నార్థకంగా జైపూర్ ప్లాంట్ భవిష్యత్తు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-03 01:51:07  IST  )

సింగరేణికి చెందిన జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) బకాయిల భారంతో సంక్షోభంలో పడింది.

పదేళ్లుగా చెల్లింపులు సున్నా.. ప్రశ్నార్థకంగా జైపూర్ ప్లాంట్ భవిష్యత్తు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణికి ఆశాకిరణంగా ఉన్న జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ) ఇప్పుడు బకాయిల సెగతో విలవిల్లాడుతున్నది. రాష్ట్రానికి వెలుగులు పంచాల్సిన ప్లాంట్.. నిధుల కొరతతో చీకట్లోకి జారుకుంటున్నది. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ. వేల కోట్లు కొండలా పేరుకుపోవడంతో సంస్థ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది. ఏకంగా రూ. 14,260 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, ఉద్యోగుల జీతాల కోసం కూడా సంస్థ బ్యాంకుల వద్ద చేతులు చాచాల్సిన దుస్థితి నెలకొంది.

ఒప్పందం పక్కా.. చెల్లింపులే సున్నా

సింగరేణి థర్మల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే విద్యుత్‌ను వంద శాతం తెలంగాణ డిస్కంలకే (టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్) విక్రయించేలా దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఉంది. 2016-17 నుంచి ఈ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పటి నుండి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ, రావాల్సిన బిల్లులు మాత్రం సకాలంలో రావడం లేదు. గత పదేళ్లలో థర్మల్ పవర్ ప్లాంట్ పనితీరు, బకాయిల వివరాలను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సంస్థ మొత్తం విద్యుత్ ఉత్పత్తి 79,383 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కాగా, 74,585 ఎంయూలు ఎగుమతి చేసింది. దీని కోసం మొత్తం రూ. 35,527 కోట్లు బిల్లు కాగా, డిస్కమ్స్ రూ. 21,267 కోట్లు మాత్రమే చెల్లించాయి. ఇంకా రూ. 14,260 కోట్లు బకాయిపడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు ఉండటం సంస్థకు పెనుభారంగా మారింది. ఈ బకాయిలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

పెరుగుతున్న బకాయిల భారం

ప్లాంట్ ప్రారంభమైన తొలి ఏడాది (2016-17)లో డిస్సమ్స్ సంస్థకు రూ. 905 కోట్లు బకాయి ఉండగా.. ప్రతియేటా ఇవి క్రమంగా పెరుగుతూపోయాయి. 2021-22 నాటికి బకాయిలు రూ. 9,161 కోట్లకు చేరగా, 2025 డిసెంబర్ నాటికి రికార్డు స్థాయిలో రూ. 14,260 కోట్లకు చేరాయి. పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఎస్టీపీపీ నుంచి డిస్కంలకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు వెళ్లినా.. స్పందన లేకుండాపోయిందని అధికారులు చెబుతున్నారు.

ప్రశ్నార్థకంగా ప్లాంట్ భవిష్యత్తు

బకాయిల వసూలు కోసం చేస్తున్న విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలవుతుండడంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్న సంస్థ లక్ష్యం నీరుగారిపోతున్నది. మరోవైపు ప్లాంట్ రోజువారి నిర్వహణకుసైతం నిధుల కొరత ఏర్పడుతున్నది. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చేదు అంశాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సొంత రాష్ట్రానికి వెలుగునిస్తున్న సంస్థను బిల్లులు చెల్లించకుండా చీకట్లోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సింగరేణికి బొగ్గు, ఇతర వాటికి సంబంధించి రావాల్సిన రూ. 46 వేల కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఇటీవలే విద్యుత్ సౌధ ముందు ఆందోళన కూడా చేపట్టింది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించకుంటే వెలుగులిచ్చే ఎస్టీపీపీని చేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుందని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story