తెలంగాణలో పెట్టుబడుల హవా.. సంగారెడ్డిలో పారిశ్రామిక విప్లవం

by Naga Rani Yarlagadda |

పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

తెలంగాణలో పెట్టుబడుల హవా.. సంగారెడ్డిలో పారిశ్రామిక విప్లవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వ్యాపారాలు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ఏర్పాటు చేస్తోంది. దాదాపు 12 వేల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పిస్తూ, పెట్టుబడులను ఆకర్షించే విధంగా, ఔత్సాహికులకు కావాల్సిన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. మొదటి విడతలో 3,245 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామికవాడ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. 2024 జులైలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ), తన 14వ బోర్డు సమావేశంలో అప్రూవల్ చేసింది. 2024 ఆగస్టులో కేంద్ర కేబినెట్ అనుమతించింది. త్వరలోనే మొదటి విడత అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. దాదాపు రూ.2,369 కోట్ల అంచనాలతో నిర్మించనున్న పారిశ్రామికవాడ లే ఔట్ పనులు నవంబరు మొదటి వారం నుంచి మొదలు పెట్టేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించారు. మొదటి విడతలో 3,245 ఎకరాల విస్తీర్ణంలో లే ఔట్ అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన టెండర్ల ఖరారు, అర్హులైన సంస్థలకు పనులు అప్పగించే ప్రక్రియ అక్టోబరు చివరి నాటికి పూర్తవుతుంది.

కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం

జహీరాబాద్ సమీపంలో నిర్మించనున్న నిమ్జ్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి. మొదటి విడతలో చేపట్టనున్న పారిశ్రామికవాడ అభివృద్ధి పనులకు రూ.2,369 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనాలతో ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఈ పారిశ్రామికవాడ అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయనున్నాయి.

పెట్టుబడులను ఆకర్షించేందుకు..

జహీరాబాద్‌కు సమీపంలో న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని రెవెన్యూ గ్రామాల పరిధిలో లే ఔట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, ఇంటర్ నెట్, పార్కులు తదితర మౌళిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పారిశ్రామిక వాడకు విమానాశ్రయాలు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 125 కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రం బీదర్ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు, ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా జరిగేందుకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అంతే కాకుండా అదనంగా, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ 600 కిలోమీటర్లు, కృష్ణపట్నం పోర్ట్ 465 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు, కావల్సిన ముడి సరుకులను దిగుమతి చేసుకునేందుకు వీలుపడుతుంది. రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసేందుకు జాతీయ రహదారి 65 (పూనే-విజయవాడ)కు 9.3 కిలోమీటర్ల దూరం ఉంది.

1.98 లక్షల మందికి ఉపాధి

ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.98 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పించవచ్చని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆటోమొబైల్ తయారీ, విద్యుత్ పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, యంత్రాలు, లోహ పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ఈ ప్రాంతం సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. పరిశ్రమల ద్వారా ఇక్కడి ప్రాంత వాసులకు శిక్షణ, ఉపాధిని అందిస్తాయి. రియల్ ఎస్టేట్ పరంగానూ అభివృద్ధి చెందుతుంది.

Next Story