పొత్తులపై YSRTP అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
పొత్తులపై YSRTP అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఎన్నికల నాటి అంశమని ఆమె అన్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి గురువారం ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు మద్దతిచ్చే ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని ఆమె స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌తో తమ పార్టీ పొత్తు ఉండదన్నారు. సీఎంతో బీజేపీ డ్యూయట్ పాడితే.. కాంగ్రెస్ కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగిందని ఆమె విమర్శలు చేశారు. అలాగే తమ పార్టీని విలీనం చేస్తున్న అంశంపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయబోమని చెప్పారు. కాంగ్రెస్‌తో తామెందుకు పొత్తు పెట్టుపోవాలని, గెలిచాక వాళ్లు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోవడానికా? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎమ్మెల్యేల సప్లయింగ్ కంపెనీలా కాంగ్రెస్ పార్టీ తీరు మారిందని ఆమె చురకలంటించారు. రాష్ట్రం కేవలం లిక్కర్‌తో మాత్రమే అభివృద్ధి చెందిందని ఆమె వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కేవలం రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ బంద్ చేశారన్నారు. రూ.30 వేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 36 లక్షల మందికి ఇండ్లు లేవని, ఇప్పటి వరకు ఎంత మందికి ఇండ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. దళితబంధులో అవినీతి జరుగుతుందని స్వయంగా కేసీఆర్ చెప్పారని, అయినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ఆమె ప్రశ్నించారు. 9 ఏళ్లలో రాష్ట్రం ఎవరికి బంగారు తెలంగాణ అయ్యిందని ఆమె నిలదీశారు. మిగులు బడ్జెట్‌ను అప్పుల కుప్పలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని విమర్శించారు. అప్పులు తెచ్చిన డబ్బు ఏమైందని ఆమె ప్రశ్నించారు.

ఇంత అప్పు చేసినా రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రూ.70 వేల కోట్ల అవినీతి ఒక్క కాళేశ్వరం లో చేశారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఖర్చు చేసేంత డబ్బు సీఎం దగ్గర ఎక్కడిదని షర్మిల ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆమె 10 ప్రశ్నతలతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ధి ఉత్సవాలు చేసే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ


Next Story