BRS జలగల్లారా.. ఇంకెంత కాలం ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు: షర్మిల తీవ్ర విమర్శలు

by Satheesh |
BRS జలగల్లారా.. ఇంకెంత కాలం ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు: షర్మిల తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంది సొమ్ము ముప్పొద్దులా మెక్కే ముదనష్టపు స్వభావం ఎవరికైనా ఉంది అంటే, అది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన అవినీతి చెంచాలు అని చెప్పుకోవాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రజల రక్తాన్ని, కష్టాన్ని ఎలా పీక్కుతినాలో బీఆర్ఎస్ నుంచి నేర్చుకోవాలని విమర్శించారు.

దిక్కుమాలిన దేశ రాజకీయాల కోసం తెలంగాణ డబ్బును ఎంత నిస్సిగ్గుగా వాడుతున్నారో అసలు సోయి ఉన్నదా? అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతున్నారని, ఆ ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమచేస్తరా? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ తిరిగే టీఎస్ ఆర్టీసీ బస్సు మొదలుకొని మంత్రులు, ఎమ్యెల్యేలు తెలంగాణ సర్కారీ బండ్లు మహారాష్ట్రలో తిప్పుతారా? అని ప్రశ్నించారు. ఆ బస్సులు, బండ్లు తెలంగాణ ఆస్తులు, తెలంగాణ ప్రజల కష్టార్జితం, వారి మీద వేసే పన్నులతో కొన్నవని పేర్కొన్నారు. ఏ హక్కు, నైతికతతో వాటిని మహారాష్ట్రలో నడుపుతారు దుర్మార్గ బీఆర్ఎస్ నాయకులు? అని ఫైర్ అయ్యారు.

తొమ్మిదేళ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచి, కాళేశ్వరంతో లక్షన్నర కోట్ల కమీషన్లు నొక్కారని, ఇవి చాలవన్నట్టు ఇసుక, గనులు, గ్రానైటు, భూములు అన్నింటిని అడ్డగోలుగా దోచుకున్న బందిపోటు రాక్షస సమితి నేతలు, చివరకు ప్రభుత్వ పథకాల్లో కూడా కక్కుర్తిగా కమీషన్లు నొక్కుతున్నారని ఆరోపించారు.

ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్టు 30 శాతం కమీషన్ బాబులు రాష్ట్ర ఆస్తులను పక్క రాష్ట్రంలో వీరి డాబులకోసం బరితెగించి వాడుకుంటున్నారన్నారు. ‘అసలు మీరు తినేది అన్నామా, గడ్డినా, మీకే తెలుస్తున్నదా? బీఆర్ఎస్ జలగల్లారా, ఇంకెంత తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి బలుస్తారు. సిగ్గుంటే, కొంచమైనా నీతి అనేది మీలో ఇంకా మిగిలి ఉంటే, సరిహద్దు దాటాక తెలంగాణ బండ్లను, ఆస్తులను అక్కికక్కడే వదిలి, మహారాష్ట్ర బళ్లను వాడండి.’’ అంటూ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ చెత్త రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిరాకరించారని, థూ అని మొహం మీద ఊయడానికి రెడీగా ఉన్నారని ఫైర్ అయ్యారు. ‘మరి ఈ పరిస్థితిల్లో మీకు ఈ డ్రామాలు అవసరమా? మరికొన్ని దినాలలో మీ సర్కారుకు తెలంగాణ ప్రజానీకం బొందపెట్టపోతోంది. ఓటుతో మీ ఆటలు కట్టించడానికి ప్రజలు రెడీ’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Y. S. Sharmila : నన్ను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుంది: మంత్రిపై షర్మిల ఫైర్

బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటి సంచలన ప్రకటన

Next Story

Most Viewed