- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: ఆ కారణం వల్లే నేతల వారసులే మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు: బండి సంజయ్
కుటుంబ వారసత్వ రాజకీయాలపై బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చేందుకు నేటి యువత రాజకీయాల్లోకి (Youth in Politics) రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టి పీడించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి ఏ మాత్రం మంచి పరిణామం కాదన్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర వ్యతిరేకమన్నారు. ప్రపంచంలో నెలకొన్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లను భారత్ అధిగమించాలంటే తప్పనిసరిగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ నుండి నిర్వహించిన పాదయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, యువత హాజరై సంజయ్ తోపాటు నడిచారు. అంతకుముందు పాదయాత్ర ఆరంభంలోబండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
నిజాం కుట్రలను భగ్నం చేసి మనకు విముక్తి:
సర్దార్ వల్లభాయ్‍పటేల్ దేశంలోని 560 సంస్థానాలను ఒకే జెండా కిందకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకం చేశారని పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదన్నారు. తెలంగాణను పాకిస్తాన్‍లో కలపాలని లేదా ముస్లిం దేశంగా మార్చాలని ఆనాడు నిజాం రాజు కుట్రలు చేశారని చెప్పారు. ఒకవేళ తెలంగాణ భారత్‍లో విలీనం కాకుండా మన పరిస్థితి ఎట్లుండేదో ఒక్క క్షణం ఆలోచించాలని.. మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్ మాదిరిగా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేదన్నారు. ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ పటేల్ మనందరికీ ఆరాధ్యుడని అలాంటి మహనీయుడిని 150 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా, ఆయన సిద్దాంతాలను కొనసాగించాలనే మహత్తర ఆశయంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు ‘‘సర్దార్@150 ఐక్యతా మార్చ్’’ (Sardar150 unity march) పేరిట అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
నేతల వారసులే మళ్లీ రాజకీయ ప్రతినిధులుగా:
నేటి యువతకు పటేల్ స్పూర్తిదాయకం. ఆయనలోని ఆలోచనలు, ఆశయాలను, క్రమశిక్షణ, దేశభక్తిని ఈనాటి యువత అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సర్దార్ పటేల్ ఆశయాల సాధన కోసం నేటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలా కాకుండా యువత తమ కెరీర్‍ను కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలకు, విదేశాలకు వెళ్లడానికే పరిమితం చేయడంవల్ల కుటుంబ రాజకీయ నేపథ్యం పెరుగుతోందని చెప్పారు. రాజకీయ నేతల వారసులే మళ్లీ రాజకీయ ప్రతినిధులుగా వస్తూ వారసత్వ రాజకీయాలను పెంపొందిస్తున్నారన్నారు. యవత ప్రాతినిధ్యం లేని నవ భారతాన్ని ఊహించుకోలేం. ఇప్పటికే యువత చాలా మంది తెలిసీ తెలియక డ్రగ్స్, మద్యం, పబ్ కల్చర్ వంటి వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు భారమై తీరని వేదనను మిగిలిస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదంటే చురుకైన యువత రాజకీయాల్లోకి రావాలి.
సౌదీ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి:
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించిన ఘటనపై బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈఘటనలో 18 మంది తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలిసిందని ఈ ఘటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని వెల్లడించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని బండి సంజయ్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని చెప్పారు.






