- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతను క్రీడల వైపు మళ్లించాలి.. ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాడెట్లకు యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే తరాలను మత్తు మహమ్మారి నుంచి కాపాడి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విశేష కృషి చేస్తున్న తెలంగాణ పోలీసు శాఖకు చెందిన 'తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో' (TSNAB), నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) విద్యార్థులను 'యాంటీ డ్రగ్ సోల్జర్స్'గా తీర్చిదిద్దేందుకు గురువారం ఒక అవగాహన సదస్సును నిర్వహించింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని రాంపల్లిలో జరుగుతున్న ఎన్‌సీసీ క్యాంపును నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య సందర్శించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటి కోరల్లో చిక్కుకుంటే జరిగే నష్టాలపై క్యాడెట్లకు ఆయన సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.
సామాజిక సంక్షకులుగా నిలవాలి..
ఈ సదస్సులో 3వ బెటాలియన్ ఎన్‌సీసీకి చెందిన 3 కంపెనీలు, 12 ప్లాటూన్లు, 36 సెక్షన్ల నుంచి సుమారు 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, 100 మంది ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు వ్యసనాలకు బానిసలైతే కుటుంబాలు ఎలా ఛిద్రమవుతున్నాయో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. సమాజంలో మత్తు మహమ్మారిని తరిమికొట్టే బాధ్యతను యువత తమ భుజాలపై వేసుకోవాలని, సామాజిక రక్షకులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడలు, సృజనాత్మక వ్యాపకాల వైపు మళ్లాలని ఆయన సూచించారు. సదస్సులో భాగంగా నార్కోటిక్స్ డిటెక్షన్ స్నిఫర్ డాగ్ చేసిన విన్యాసాలు క్యాడెట్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎక్కడో రహస్యంగా దాచిపెట్టిన డ్రగ్స్‌ను, వాటిని తీసుకెళ్తున్న వ్యక్తులను ఆ శునకం ఇట్టే పసిగట్టి పట్టుకున్న తీరును విద్యార్థులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. అనంతరం బ్యూరో ఆధ్వర్యంలో క్యాడెట్లను ప్రోత్సహించేందుకు క్రికెట్ బ్యాట్లు, వాలీబాల్స్, ఫుట్‌బాల్స్, రింగ్స్ తదితర క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు.
సమాచారం ఇస్తే నగదు బహుమతి..
ఇటీవలి కాలంలో ఎంతోమంది విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు బానిసలై నేరాలు చేస్తూ, సంఘ విద్రోహ శక్తులుగా మారడంపై డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల కదలికలు, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతున్నా, సేవిస్తున్నా.. పౌరులు ఏమాత్రం భయపడకుండా వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1908 కు లేదా వాట్సాప్ నంబర్ 87126 71111 కు సమాచారం అందించాలని కోరారు.
అలాగే tsnab.tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా గానీ, [email protected] కు మెయిల్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, పక్కా సమాచారం ఇస్తే తగిన నగదు రివార్డు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైదులు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, లాజిస్టిక్స్ ఆర్‌ఎస్‌ఐ సైదులు తదితర సాంకేతిక విభాగం సిబ్బంది పాల్గొన్నారు.






