HYD: పోలీసుల ముందే స్టంట్స్ చేసిన పోకిరీలు

by Gantepaka Srikanth |

నగరంలో బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

HYD: పోలీసుల ముందే స్టంట్స్ చేసిన పోకిరీలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో బైక్ స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా అత్తాపూర్ ప్రధాన రహదారిపై కొందరు యువకులు ఏకంగా పోలీసుల ముందే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రెచ్చిపోయారు. అయితే, వారి 'ఓవరాక్షన్' ఎంతోసేపు సాగలేదు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసుల కళ్ళ ముందే కొందరు యువకులు బైక్‌లపై వేగంగా దూసుకువచ్చారు. హెల్మెట్లు లేకుండా, ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేసి ఒకే బైక్‌పై ప్రమాదకరంగా వెళుతూ స్టంట్లు చేయడం ప్రారంభించారు. ఇంతటితో ఆగకుండా, తమ సాహసాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ పోలీసులనే సవాల్ చేసేలా ప్రవర్తించారు.

వెంటాడి పట్టుకున్న పోలీసులు..

పోలీసుల సమక్షంలోనే ఇంతటి తెగింపు ప్రదర్శించడంతో అత్తాపూర్ పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ యువకులను పోలీసులు సినిమా ఫక్కీలో వెంబడించారు. ఎట్టకేలకు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. "రోడ్లపై స్టంట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే సహించేది లేదు. సోషల్ మీడియా రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవు" అని పోలీసులు హెచ్చరించారు.

Next Story