- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు హామీ ఇవ్వండి.. నెరవేర్చే బాధ్యత నాది: మంత్రి పొంగులేటి
"వార్డుల్లోకి వెళ్ళండి.. జనం సమస్యలను గుండెలకు హత్తుకోండి.. పరిష్కరిస్తామని గట్టిగా హామీ ఇవ్వండి.. వాటిని నెరవేర్చే బాధ్యత తనది" అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం అభ్యర్థులకు స్పష్టం చేశారు.

దిశ, ఖమ్మం: "వార్డుల్లోకి వెళ్ళండి.. జనం సమస్యలను గుండెలకు హత్తుకోండి.. పరిష్కరిస్తామని గట్టిగా హామీ ఇవ్వండి.. వాటిని నెరవేర్చే బాధ్యత తనది" అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో 32 వార్డుల అభ్యర్థులు, ఇన్-చార్జులతో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ... మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, ఏదులాపురం రూపురేఖలను మారుస్తానని మంత్రి చెప్పారు. అభివృద్ధిలో ఏదులాపురాన్ని రాష్ట్రానికే ఒక దిక్సూచిగా, ఆదర్శ మున్సిపాలిటీగా నిలబెట్టే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధిలో ఏదులాపురాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి వార్డులోనూ తాను స్వయంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, దూకుడుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వార్డు, జోనల్ ఇన్-చార్జులు, అభ్యర్థులు సమన్వయంతో ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలను వివరిస్తూనే, అభివృద్ధి పట్ల వారికున్న నిబద్ధతను చాటి చెప్పాలన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు.






