నిన్న చర్చలు.. ఇవాళ అరెస్టులా? ప్రభుత్వంపై మూసీ జన ఆందోళన్ విమర్శలు

by Prasad Jukanti |

మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్ వేళ ఎంజేఏ ప్రతినిధి గృహనిర్బంధం చేయడంపై మూసీ జన ఆందోళన సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

నిన్న చర్చలు.. ఇవాళ అరెస్టులా? ప్రభుత్వంపై మూసీ జన ఆందోళన్ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు’ (Musi River Front Development) ప్రణాళిక గురించి ఇవాళ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజెంటేషన్ వేళ మూసీ నది దాని తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల హక్కుల కోసం పని చేస్తున్న మూసీ జన్ ఆందోళన్ (Musi Jan Andolan సంస్థ కీలక ప్రకటన చేసింది. నిన్న జన్ ఆందోళన్ ప్రతినిధి బృందాన్ని డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రుల బృందం ఆహ్వానించి చర్చలు జరిపిన మరుసటి రోజే ఎంజేఏ సంస్థ ప్రతినిధిని నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధం అని మండిపడింది. ప్రజాస్వామ్య రీతిలో చర్చలకు, ప్రత్యామ్నాయ సూచనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చి ఆ మరుసటి రోజే మా కార్యకర్తను నిర్బంధించడం ఏంటని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ఎంజేఏ స్పష్టం చేసింది. నిన్న డిప్యూటీ సీఎం, మంత్రుల బృందం మమ్మల్ని ఆహ్వానించి చర్చించిన అంశాల్లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సమీక్ష చేసి ప్రజల మీద నిర్బంధ తొలగింపులు లేకుండా, పర్యావరణానికి హానీ కలగకుండా నది పునరుజ్జీవాన్ని చేపట్టాలని డిమాండ్ చేసింది.

ప్రజల నుంచి సూచనలు కోరుతామన్నారు:

ప్రభుత్వ ఆహ్వానం మేరకు గురువారం ప్రజాభవన్‍లో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‍తో కూడిన మంత్రుల బృందాన్ని మూసీ జన ఆందోళన కు చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సమావేశం అయిందని ఎంజేఏ తెలిపింది. ఈ సందర్భఁగా ప్రాజెక్టుకు సంబంధించిన తమ దీర్ఘకాలిక డిమాండ్లు, ఆందోళనలు వివరించామని మూసీ నది పునరుజ్జీవనం దశ-1కు సంబంధించిన ప్రణాళికలు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు విరుద్ధంగా విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశం ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ 10 మార్చి 2026న సీఎం కు రాసిన లేఖ నేపథ్యంలో జరిగిందని పేర్కొన్నారు. మార్చి 13న హోటల్ తాజ్ కృష్ణలో జరిగే కార్యక్రమం వివరమైన ప్రాజెక్టు నివేదిక విడదల కార్యక్రమం కాదని కేవలం ప్రాజెక్టు లక్ష్యాలు, దాని పరిధిని వివరించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే అని భట్టి విక్రమార్క చెప్పారన్నారు. ఆ ప్రజెంటేషన్ ను వెబ్ సైట్‍లో ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కోరుతామని తెలిపినట్లు వెల్లడించారు.

మా మద్దతు లేదు:

గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సీఎం ఆహ్వానించినట్లు వచ్చిన వార్తలు తప్పుడు ప్రాచరం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారని అయితే ఆ సమాచారం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, సీఎంవో ఆఫీస్ ప్రకటనలో ప్రచురితమైందనే విషయాన్ని ఎంజేఏ ప్రతినిధులు భట్టి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు, సంఘాలఆందోళనలను ప్రచారంగా కొట్టి పారకేయకుండా ప్రభుత్వం వాటితో నిర్మాణాత్మకంగా చర్చించాల్సి అవసరం ఉందని ఎంజేఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవడం కోసం మాత్రమే డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆకస్మిక ఆహానాన్ని అంగీకరించామని అంతే తప్ప మా సమావేశం ద్వారా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఎంజేఏ మద్దతు తెలిపినట్లు భావించకూడదని స్పష్టం చేసింది. నిన్న మాతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఇవాళ మా సభ్యులలో ఒకరైన సయ్యద్ బిలాల్ ను హౌస్ అరెస్టు చేయడం బాధాకరం అని ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తు్న్నట్లు ప్రకటించింది.

Next Story