ఆర్టీసీలో 'యాత్రా దానం'

by Elthuri vijay kumar |

సరికొత్త పథకం శ్రీకారం చుట్టిన టీజీఎస్ ఆర్టీసీ

ఆర్టీసీలో యాత్రా దానం
X

ఆర్టీసీలో 'యాత్రా దానం'

- సరికొత్త పథకం శ్రీకారం చుట్టిన టీజీఎస్ ఆర్టీసీ

- వాల్ పోస్టర్ ఆవిష్కరించిన రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: సామాజిక బాధ్యతలో భాగంగా 'యాత్రా దానం' అనే వినూత్న పథకాన్ని టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ పథకం కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీలో ఇటీవల ప్రవేశపెట్టిన అనేక టూర్ ప్యాకేజీ లు విజయవంతం అయ్యాయని, అందులో భాగంగా దాతల కోసం ప్రత్యేకంగా 'యాత్రా దానం' అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. ముఖ్యంగా వ్యక్తుల పుట్టిన రోజులు, వివాహ మహోత్సవాలు, పండుగలు, ఇతర శుభ కార్యాలు, తదితర ఆనందదాయకమైన శుభ దినాన పేద విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు, పుణ్యం కోసం భక్తులు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రలకు తీసుకెళ్ళడానికి సంస్థ ద్వారా బస్సులను బుక్ చేసి తీసుకెళ్ళడమే ఈ 'యాత్ర దానం పథకం' ముఖ్య ఉద్దేశ్యమని ఆయన వివరించారు. ఈ పథకం నిర్వాహణ కోసం సంస్థ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందని, ఇందులో ముందుగా రవాణా శాఖ మంత్రి, సంస్థ ఎండి లు లక్ష రూపాయలను డిపాజిట్ చేశారని, ఇలాంటి సరికొత్త పథకం దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టామని ఆర్ఎం అన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆయా సమీప డిపో మేనేజర్లను కలిస్తే వివరాలు తెలుపుతారని ఆర్ఎం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఫ్యూటీ ఆర్ఎంలు లక్ష్మి ధర్మ, కవిత, మహబూబ్ నగర్ డిఎం సుజాత, పీఓ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story