హౌసింగ్ బోర్డు స్థలాలకు యమ క్రేజ్.. రూ.33 కోట్లు పలికిన ఒక్క ప్లాట్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి.

హౌసింగ్ బోర్డు స్థలాలకు యమ క్రేజ్.. రూ.33 కోట్లు పలికిన ఒక్క ప్లాట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్లాటు చదరపు గజం రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి గచ్చిబౌలిలో ప్లాట్లు రికార్డు స్థాయి ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్‌ ఏకంగా రూ.33 కోట్లకు అమ్ముడుపోయింది. మరోచోట రూ.13.51 కోట్లు పలికింది. రెండు ఎంఐజీ ప్లాట్లను కూడా సుమారు రూ.4.50 కోట్లకు పైగా వెచ్చించి బహిరంగ వేలంలో దక్కించుకోడానికి పోటీపడ్డారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ప్లాట్లను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. మొత్తం 11 ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్ల మేర ఆదాయం వచ్చిందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ.గౌతమ్ తెలిపారు.

బహిరంగ వేలం నిర్వహణ

నగరంలోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్లాట్లకు సోమవారం హౌసింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. చింతల్ ప్రాంతంలో 266 చదరపు గజాల విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ప్లాట్లు, గచ్చిబౌలి ప్రాంతంలో కమర్షియల్ ప్లాట్లు, నిజాంపేటలో 413 చదరపు గజాల ప్లాట్లు వీటిలో ఉన్నాయి. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఈ స్థలాల వేలం పాటలో 55 మంది పాల్గొన్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో 3,271 చదరపు గజాల భూములు, చింతల్ ప్రాంతంలో 799.98 చదరపు గజాలు, నిజాంపేటలో 1,653 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్లు వేలం వేయగా రూ.65.02 కోట్లు బోర్డుకు ఆదాయంగా సమకూరింది.

గచ్చిబౌలి భూముల ద్వారానే రూ.56 కోట్లు

గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 1,487 గజాల కమర్షియల్ ల్యాండ్‌ను గజానికి రూ.2.22 లక్షల చొప్పున సుమారు రూ.33 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ భూములకు చదరపు గజానికి 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ధారించగా వేలం పాటలో అది రూ.2.22 లక్షలు పలికింది. అట్లాగే ఇదే ప్రాంతంలోని 1,200 గజాల పాఠశాల భూములకు ఆఫ్ సెట్ ధర చదరపు గజానికి రూ.80 వేలుగా నిర్ధారించగా, వేలంలో ఆ భూములను గజానికి రూ.1.12 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అలాగే ఇక్కడి రెండు ఎంఐజీ ప్లాట్లు చదరపు గజం రూ.1.86 లక్షలు, రూ.1.32 లక్షల ధరలు పలికాయి. ఒక్క గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించిన భూముల ద్వారానే రూ.55.56 కోట్ల మేర ఆదాయం హౌసింగ్ బోర్డుకు వచ్చింది.

చింతల్ భూముల రేట్లు ఆకాశానికే..

కుత్బుల్లాపూర్ మండలం చింతల్ ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు ఎంఐజీ ప్లాట్లు కూడా బహిరంగ వేలంలో అత్యధిక ధరలకు అమ్ముడు పోయాయి. ఈ ప్రాంతంలో మొత్తం పది ప్లాట్లను వేలం వేయగా, వీటిలో ప్లాట్ నం.113, 114, 115ల ద్వారానే సుమారు రూ.8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. నిజాంపేట-బాచుపల్లిలోని 4 ప్లాట్లను సుమారు రూ.70 లక్షలకు వేలం పాటలో కొనుగోలు చేశారు.

Next Story