- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో విజయం.. 72 గంటల్లో 816 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన స్టేజ్-2లోని నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) గురువారం వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 72 గంటల నిరంతర పరీక్షా కాలంలో యూనిట్ సగటున 816 మెగావాట్లకు పైగా ఉత్పత్తి చేస్తూ గరిష్ఠంగా 825 మెగావాట్ల లోడ్‌ను మోసింది. ఈ నాలుగో యూనిట్ వాణిజ్య ఉత్పత్తిలోకి రావడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్ ఉత్పత్తి 3,200 మెగావాట్లకు చేరింది.
దశాబ్దాలుగా ఎదురుచూపులు..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో తెలంగాణ విద్యుత్ భద్రతకు కీలకంగా ప్రతిపాదించారు. ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లతో మొత్తం 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సూపర్ క్రిటికల్ ప్రాజెక్టును రూపొందించారు. భూసేకరణ, నిధుల లభ్యత, కాంట్రాక్టర్ల ఆలస్యం, కోవిడ్ ప్రభావంతో ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లింది. కేంద్ర విద్యుత్ సంస్థలు, బీహెచ్ఈఎల్ వంటి సరఫరాదారులతో సమన్వయం పెంచి పెండింగ్ పనులను వేగవంతం చేసింది.
అందుబాటులో 3,200 మెగావాట్లు..
నాలుగో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ చేపట్టడంతో ప్రస్తుతం నాలుగు యూనిట్లు ఒక్కోటి 800 మెగావాట్ల చొప్పున కమర్షియల్ ఆపరేషన్ పూర్తి చేసుకున్నాయి. 5వ యూనిట్‌ను సైతం త్వరగా పూర్తి చేసి ఆపరేషనల్‌గా మారిస్తే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యానికి చేరుకోనుంది. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయని.. తుది దశ పనులు పూర్తయితే అది సైతం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగో యూనిట్ ఆపరేషనల్ కావడంతో రాష్ట్ర గ్రిడ్‌కు యాదాద్రి నుంచి 3,200 మెగావాట్లు నిరంతరంగా అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. ఇది రాష్ట్ర విద్యుత్ భద్రతకు భారీ ఊతంగా మారింది.
తగ్గనున్న ఆర్థిక భారం..
యాదాద్రి నాలుగో యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి వేసవి కాలంలో పీక్ డిమాండ్‌ను తేలికగా ఎదుర్కొనేందుకు దోహదపడనుంది. బయటి మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆధారం తగ్గనుంది. వ్యవసాయ, గృహ, పరిశ్రమల అవసరాలకు స్థిరమైన సరఫరాకు మార్గం సుగమం కానుంది. విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది. యాదాద్రి యూనిట్లు సూపర్ క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇది సంప్రదాయ థర్మల్ ప్లాంట్లతో పోలిస్తే.. ఎక్కువ సామర్థ్యం, తక్కువ బొగ్గు వినియోగం, తక్కువ కార్బన్ ఉద్గారాలు, తక్కువ ఉత్పత్తి వ్యయం వంటి అనేక ప్రయోజనాలను అందించనుంది. నాలుగో యూనిట్ విజయవంతంగా అందుబాటులోకి రావడంతో ఐదో యూనిట్‌ను సైతం వీలైనంత త్వరగా కమర్షియల్ ఆపరేషన్‌లోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టారు. అది పూర్తయితే యాదాద్రి పూర్తి స్థాయి 4,000 మెగావాట్ల మెగా థర్మల్ హబ్‌గా మారనుంది. మరో వైపు కేంద్ర విద్యుత్ సంస్థ ప్రకటించిన మేరకు... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని చివరి యూనిట్ ఈ ఏడాది మార్చిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.






