కన్నీటిసంద్రంలో సాహితీ లోకం.. రచయిత అందెశ్రీ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-10 03:44:53  IST  )

ప్రముఖ రచయిత అందెశ్రీ ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కన్నీటిసంద్రంలో సాహితీ లోకం.. రచయిత అందెశ్రీ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అందెశ్రీని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపారు. అందెశ్రీ హఠాన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అన్ని పార్టీల ముఖ్య నేతలు, సాహితీ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ పాటతో ప్రజల్లో విశేషమైన పేరును సంపాదించుకున్నారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ ఆయనకు ఆయనే సాటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి సేవలందించారు. 2006లో గంగ సినిమాకు గాను అందెశ్రీకి నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

READ MORE .....

అందెశ్రీ మృతిపై సీఎం రేవంత్ దిగ్బ్రాంతి

Next Story