క్షణికానందం కోసం ప్రాణాలు తీస్తారా? కనీస స్పృహ ఉండక్కర్లేదా? సీపీ సజ్జనార్ ఫైర్

by Ramesh Naini |

నిషేధిత మాంజా వినియోగంపై ప్రజల్లో కనీస స్పృహ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశంలోకి గాలిపటాన్ని పంపి మురిసిపోవడమే కాదు.. మన చేతిలోని ఆ ప్లాస్టిక్ దారం దారినపోయే వారి పాలిట 'యమపాశం'లా మారుతోందన్న సోయి ఉండక్కర్లేదా? అని సజ్జనార్ నిలదీశారు.

క్షణికానందం కోసం ప్రాణాలు తీస్తారా? కనీస స్పృహ ఉండక్కర్లేదా? సీపీ సజ్జనార్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి సంబరాల వేళ ఆనందోత్సాహాల నడుమ ఉండాల్సిన ఎన్నో కుటుంబాల్లో నిషేధిత 'చైనా మాంజా' తీరని విషాదాన్ని మిగిల్చిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట చోటుచేసుకున్న విషాద ఘటనలపై శుక్రవారం ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. నిషేధిత మాంజా వినియోగంపై ప్రజల్లో కనీస స్పృహ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశంలోకి గాలిపటాన్ని పంపి మురిసిపోవడమే కాదు.. మన చేతిలోని ఆ ప్లాస్టిక్ దారం దారినపోయే వారి పాలిట 'యమపాశం'లా మారుతోందన్న సోయి ఉండక్కర్లేదా? అని సజ్జనార్ నిలదీశారు. మనుషులే కాదు.. నోరులేని మూగజీవాలు సైతం ఆ పదునైన దారానికి రెక్కలు తెగి విలవిల్లాడి ప్రాణాలు విడుస్తున్న ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని పేర్కొన్నారు.

అమ్మేవారే కాదు.. కొనేవారూ నేరస్తులే..

నిషేధం అమల్లో ఉన్నా చైనా మాంజాను దొంగచాటుగా అమ్మేవారు ఎంతటి నేరస్తులో.. తెలిసి కూడా వాటిని కొని, పది మంది ప్రాణాలతో చెలగాటమాడేవారూ అంతే బాధ్యులని సీపీ స్పష్టం చేశారు. "క్షణకాలం ఆనందం కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా? ఆసుపత్రుల పాలైన వారికి, అసువులు బాసిన వారికి ఎవరు జవాబుదారీ?" అని ఆయన ప్రశ్నించారు. బాధితుల కుటుంబాల్లోని ఆర్తనాదాలను విని, ఆ ఆవేదనను తమదిగా భావించి ఇప్పటికైనా చైనా మాంజాను విడనాడాలని, సాటి మనుషుల పట్ల బాధ్యతగా మెలగాలని పిలుపునిచ్చారు.

నిరంతర నిఘా కొనసాగుతోంది

సోషల్ మీడియా ద్వారా చేపట్టిన #SayNoToChineseManja ప్రచారం, పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌ల వల్ల గత సంక్రాంతితో పోలిస్తే ఈ సారి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని సజ్జనార్ వెల్లడించారు. అయితే, జరిగిన కొద్దిపాటి ఘటనలు కూడా ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి ఒక్క ప్రమాదం కూడా జరగకూడదన్నదే తమ లక్ష్యమని, ఈ క్రమంలో మాంజా క్రయవిక్రయాలపై ఏడాది పొడవునా నిరంతర నిఘా ఉంచి, దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story