మీ ఇంటి ఆడబిడ్డను ఇట్లా ఏడిపిస్తారా.. మీడియా ఎదుట మంగ్లీ ఎమోషనల్

by Kema Shiva Kumar |

మైక్రో ఫైనాన్స్ కేసులో తన పేరు రావడంపై సింగర్ మంగ్లీ ఎమోషనల్ అయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన ఫోటోలను వాడి కుటుంబాన్ని బాధపెట్టవద్దని మీడియాకు రిక్వెస్ట్ చేశారు.

మీ ఇంటి ఆడబిడ్డను ఇట్లా ఏడిపిస్తారా.. మీడియా ఎదుట మంగ్లీ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) ప్రమేయం ఉందంటూ ప్రచారం జరుగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసు (Micro Finance Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్‌గా మారారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ.. అసలు ఈ కేసుతో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి తనను మోసం చేశాడని, కంపెనీలో పెట్టిన సుమారు రూ. 20 కోట్లను ఆయనే తీసుకున్నాడని మధు ఆరోపించారు. అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి ఇద్దరూ స్నేహితులని ఆయన పేర్కొన్నారు.

దయచేసి నా ఫోటోను వాడకండి..

మరోవైపు, ఈ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందిస్తూ మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ’నాన్న అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరికైనా అమ్మనాన్నలే అతిపెద్ద ఎమోషన్. కానీ మీడియాలో, టీవీల్లో ఈ కేసుకు సంబంధించి నా ఫోటోలు చూసి వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’ అని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయి. మీడియాలో చూపే విధానాన్ని బట్టే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నన్ను ఇలా తప్పుగా చూపించడం వల్ల సోషల్ మీడియాకు, కొందరికి వచ్చే లాభం ఏంటి?’ అని ఆమె ప్రశ్నించారు. తన పేరు చెప్పి కొందరు డబ్బు వసూలు చేశారని, వారిపై ఇప్పటికే కేసులు పెట్టామని ఆమె తెలిపారు. మోసపోయిన బాధితులకు తాను తప్పకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘దయచేసి ఈ వివాదంలో నా ఫోటోలను వాడకండి. నేను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే నన్ను జైలుకు పంపండి. నేను ఏ తప్పూ చేయలేదు, అందరికీ నిజాలు తెలిసినా అసత్యాలు ప్రచారం చేయడం మా కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. మీ ఇంటి ఆడబిడ్డను ఇలా ఏడిపిస్తారా?" అని మంగ్లీ కన్నీటి పర్యంతమయ్యారు.

Next Story