- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపరిచితుడే ప్రాణదాత.. రక్తదానానికి వెనకాడుతున్న కుటుంబీకులు
మాది రక్త సంబంధం అని చెప్పుకుంటాం.. కానీ మనలో ఒకరు ఆసుపత్రి బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే మాత్రం రక్తం ఇచ్చేందుకు వెనకాముందు ఆడుతాం.

దిశ, తెలంగాణ బ్యూరో : మాది రక్త సంబంధం అని చెప్పుకుంటాం.. కానీ మనలో ఒకరు ఆసుపత్రి బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే మాత్రం రక్తం ఇచ్చేందుకు వెనకాముందు ఆడుతాం.. వినడానికి కఠినంగా అనిపించినా నేడు సమాజంతో జరుగుతున్న వాస్తవం ఇదే. దేశంలో రక్తదానం విషయంలో ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఆపదలో రక్తదానం చేసేందుకు సొంత వారే ముందుకు రావడం లేదనే చేదు నిజం ఆవేదన కలిగిస్తోంది. మరోవైపు రక్తదాతల్లో మహిళల వాటా కేవలం 10శాతం మాత్రమే కావడం కూడా కలవరపెడుతోంది. నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా దేశంలో రక్తదానం పట్ల ఉన్న అవగాహన లేమిపై దిశ ప్రత్యేక కథనం.
అపరిచితుడే ప్రాణదాత..
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం.. దేశంలో సేకరిస్తున్న రక్తంలో 71 శాతం కేవలం అపరిచిత వ్యక్తులు, స్వచ్ఛంద దాతల నుంచే వస్తోంది. కానీ, సొంత కుటుంబ సభ్యుడి కోసం రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చేవారి శాతం కేవలం 29 శాతం మాత్రమే. రోడ్డు ప్రమాదమో, ప్రసవమో జరిగినప్పుడు సొంత అన్నదమ్ములు, బంధువులు ఆసుపత్రి కారిడార్లలోనే ఉంటారు. కానీ రక్తం ఇవ్వడానికి భయపడి.. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతుంటారు. రక్తదానం చేసే వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తుంటారు. తెలిసినవారికి ఫోన్ చేసి రక్తదానం చేయాలి కాస్త అర్జంట్ వెంటనే రావాలంటూ వేడుకుంటారు.. ముక్కూ మొహం తెలియని వ్యక్తులు ఎక్కడి నుంచో తమ సొంత ఖర్చులతో హాస్పిటల్స్‌కు వచ్చి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతుంటే తోబుట్టువులు మాత్రం వెనకడుగు వేయడం అవగాహనా లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది.
డబ్ల్యూహెచ్ఓ నివేదికలో విస్తుపోయే నిజాలు..
- దేశంలో రక్తం ఇచ్చేవారిలో మహిళల వాటా కేవలం 10 శాతంలోపే కావడం గమనార్హం. రక్తహీనత సమస్యలతోపాటు శారీరక బలహీనత వస్తుందనే అపోహల వల్ల మహిళలు రక్తదానానికి ముందుకు రావడం లేదు.
- దేశంలో స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్నవారిలో అత్యధికులు 18-30 ఏళ్లలోపు యువతే. అయితే వీరంతా ఏదో ఒక సందర్భంలో ఒకసారి ఇచ్చి ఆపేస్తున్నారు తప్ప.. క్రమం తప్పకుండా ఏటా రెండు, మూడుసార్లు ఇచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
- సొంత బంధువుల ప్రాణాలు కాపాడే అత్యవసర స్థితిలో.. కొందరు తమకున్న అనారోగ్యాలను దాచిపెట్టి రక్తం ఇస్తుంటారు. దీనివల్ల రోగులకు ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ వంటి వ్యాధులు సంక్రమించే ముప్పు ఎక్కువని, అదే సమయంలో స్వచ్ఛంద దాతల రక్తం అత్యంత సురక్షితమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేస్తోంది.
అపోహలు వద్దు.. ఇవి తెలుసుకోండి..
- రక్తం ఇస్తే వీక్ అయిపోరు. రక్తం ఇచ్చిన 24 నుంచి 48 గంటల్లో శరీరంలో కొత్త ప్లాస్మా తయారవుతుంది.
- 18 నుంచి 65 ఏళ్ల వయసు, 45 కేజీల బరువు, 12.5 గ్రాముల హీమోగ్లోబిన్ ఉన్న ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు.
- రక్తం నుంచి తీసే ప్లేట్‌లెట్స్ కేవలం 5 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. అందుకే నిరంతరం రక్తదానం జరగాలి.
ఆస్తులు పంచుకోవడం కాదు..
రక్త బంధం అంటే కేవలం ఆస్తులు, అంతస్తులు పంచుకోవడం కాదు. ఆపదలో ఉన్నప్పుడు రక్తాన్ని కూడా పంచుకుని ప్రాణాన్ని నిలబెట్టేందుకు ముందుకు రావాలి. ఈ రక్తదాన దినోత్సవం సాక్షిగా కుటుంబాల ఆలోచనా విధానం మారాలి. అపరిచితుల వైపు చూడటం ఆపి, సొంత మనుషుల ప్రాణాల కోసం మొదట ఇంట్లోవాళ్లే ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.






