- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యనగరంలో నీటి సంరక్షణకు తిలోదకాలు
హైదరాబాద్‌లో భూగర్భ జలాలు పడిపోవడంతో రోజుకు 13 వేల వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ మహానగరంలో నీటి సంరక్షణ కష్టంగా మారింది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. బోర్లు ఎండిపోవడంతో జలమండలి సరఫరా చేస్తున్న ట్యాంకర్లు, ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. బోర్లు ఎండిపోతే ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు తప్ప ఇంటి ఆవరణంలో ఒక ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడానికి మాత్రం చేతులు రావడం లేదు. దీంతోపాటు వర్షాకాలం వచ్చిందంటే రోడ్లు చెరువులుగా మారడంతోపాటు కాలనీలు మునగాల్సిందే. దీనికి వర్షపు నీరు ఇంకడానికి అవకాశం లేకపోడమే. వర్షాకాలంలో నీరంతా మూసీ పాలుకావడం.. ఎండాకాలంలో నీటిని కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అందుకు ఇంకుడు గుంతల ఏర్పాటుపై సరైన ఎన్‌ఫోర్స్‌మెంట్ లేకపోవడమేనని పలువురు పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎండాకాలంలో ట్యాంకర్లకు డిమాండ్..
క్యూర్ పరిధిలో ముఖ్యంగా అత్యధిక జనాభా, బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ఏరియాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎస్ఆర్ నగర్, మణికొండ, కూకట్‌పల్లి డివిజన్‌లలోనే అత్యధికంగా ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయంటే ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ట్యాంకర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అయితే జలమండలి పరిధిలో దాదాపు 14 లక్షల కనెక్షన్లు ఉండగా.. కేవలం 42 వేల గృహాలే ట్యాంకర్ బుక్ చేసుకుంటున్నారు. అంటే సంబంధిత ఇండ్లలో బోర్లు ఎండిపోవడంతోనే తరుచుగా ట్యాంకర్లను బుక్ చేస్తున్నారని అధికారులు గుర్తించారు. రోజువారీగా 550 ఎంజీడీ నీటి సరఫరా చేస్తున్నా.. ప్రతి రోజూ 13 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే నీటి కొరత తీవ్రత అర్థమవుతోంది.
20 వేల ఇంకుడు గుంతలే..
ఇంకుడు గుంతలపై జల మండలి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జలమండలి అధికారులు నిర్వహించిన సర్వే ఆధారంగా గతంలో ఇంకుడు గుంతలు లేని ఇండ్లను గుర్తించడంతోపాటు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని 16వేల ఇండ్లకు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. క్యూర్ పరిధిలోని 300 గజాల పైన ఉన్న ప్రతి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 14 వేల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా సుమారు 20 వేల ఇంకుడు గుంతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో 20వేల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించినట్టు జలమండలి అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకుడు గుంత ఏర్పాటు చేయకుంటే కఠిన చర్యలు తీసుకోవడంలో జలమండలి విఫలమైందనే చెప్పాలి.
వరదల నివారణలో..
వర్షాకాలం వచ్చిదంటే కొన్ని కాలనీలు నేటికీ నీటమునగాల్సిందే. అందుకు సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు నీరు ఇంకే పరిస్థితి లేకపోవడమే. గతంలో నగరంలో వరదల నివారణకు కృత్రిమ చెరువులను తవ్వాలని నిర్ణయించారు. కానీ ఆచరణకు నోచుకోలేదు. జీహెచ్ఎంసీ, జలమండలి, సీఎంసీ, ఎంఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో రైలు, ఆర్టీసీ, టూరిజం, ఆర్ అండ్ బీ, విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ, టూరిజం, పోలీసుశాఖ వంటి ప్రధాన విభాగాలకు లక్షలాది ఖాళీ స్థలాల్లో భారీ స్థాయిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడానికి అవకాశమున్న పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలూలేకపోలేదు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుంటే ఎండాకాలంలో బోర్లు పనిచేయడానికి అవకాశముందని పలువురు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.






