ఎల్ నినో ఎఫెక్ట్.. అధికార పార్టీలో టెన్షన్!

by Naga Rani Yarlagadda |

దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార పార్టీ నాయకుల్లో టెన్షన్​మొదలైంది.

ఎల్ నినో ఎఫెక్ట్.. అధికార పార్టీలో టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార పార్టీ నాయకుల్లో టెన్షన్​మొదలైంది. నైరుతి రుతు పవనాల కాలం మొదలై రెండు వారాలు కావస్తున్న రాష్ట్రంలోని సగం మండలాల్లో వర్షం కురియలేదు. ఈ ఎల్ నినో ప్రభావం ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అది అన్నివర్గాలపై పడుతుందని, అధికారులు, అధికారపార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రైతులు చేసే వ్యవసాయంపై ఇంటిల్లిపాది కుటుంబసభ్యులతో పాటు ఆ గ్రామంలో వ్యవసాయ కూలీలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు ఉపయోగం ఉండదు. లక్షలాది మంది వ్యవసాయంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందుతారు. ఒక్క వ్యవసాయం సరిగ్గా లేకుంటే అన్నింటిపై ప్రభావం చూపనుంది. పనులు లేకుంటే ప్రజలు కూలీలు, వ్యవసాయదారులు ప్రభుత్వాలపై ఆధారపడి, ప్రభుత్వాలపై శాపనార్ధాలు పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు మరింత విమర్శలు చేసే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో కరువు వచ్చింది. ఒక సెంటిమెంట్​ను కూడా అప్పటి కాంగ్రెస్​ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటున్నారు. వర్షాలు తక్కువగా కురిస్తే వ్యవసాయదారులతో పాటు రాజకీయంగా అధికార కాంగ్రెస్​కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు.

ఈసారి వర్షాభావం?

వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం.. రాష్ట్రంలో 621 మండలాలు ఉండగా ఇందులో 289 మండలాల్లో వర్షం కురవలేదని, 313 మండలాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. 19 మండలాల్లో మాత్రం భారీ వర్షాలు కురిశాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జూన్​1నుంచి సెప్టెంబర్​30 వరకు నైరుతి రుతు పవనాలను లెక్కలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జూన్​1 నుంచి 12 వరకు లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు సగం మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన మండలాల్లో సైతం తెలికపాటి వర్షాలు మినహా పెద్దప్రభావం చూపే వర్షాలు పడలేదు. గత సంవత్సరం మే మూడో వారం నుంచే వర్షాలు కురిశాయి. అయితే జూన్​లో మాత్రం వర్షాలు కురవలేదు. ఆ తర్వాత భారీ వర్షాలకు అటు రైతులు, ఇటు ప్రభుత్వాలు, నీటిపారుదల, విద్యుత్​శాఖ అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అత్యధిక రోజులు ఎత్తి ఉంచాల్సి వచ్చింది. భారీవర్షం కురిసిన మండలాలు కేవలం 19 మండలాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇందులో జగిత్యాల జిల్లాలో వెల్గటూరు, సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి, గంబీరావుపేట, రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి, చేవెళ్ల, మెయినాబాద్, షాబాద్, కందుకూరు, కేశంపేట, తలకొండపల్లి, కడ్తాల్, రాజేంద్రనగర్​మండలాలు, వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట, మహబూబ్​నగర్​జిల్లాలో గండీడ్, నాగర్​కర్నూల్ జిల్లాలో ఊర్కొండ, కోడేర్, ఉప్పునుంతల, బల్మూర్, అచ్చంపేట మండలాలు ఉన్నాయి.

Next Story