చిరంజీవిని డైరెక్ట్‌గా సినిమా ఆఫర్ అడిగిన బుచ్చిబాబు.. మెగాస్టార్ ఏమన్నారంటే?

by Pulgam srinivas |

బుచ్చిబాబు సానా నేరుగా చిరంజీవిని సినిమా అవకాశం అడగగా, ఆయన కూడా పాజిటివ్‌గానే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవిని డైరెక్ట్‌గా సినిమా ఆఫర్ అడిగిన బుచ్చిబాబు.. మెగాస్టార్ ఏమన్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఆయనకు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఇక తాజాగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన 'పెద్ది' సినిమాకి దర్శకత్వం వహించాడు. జూన్ 4న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా విజయోత్సాహంలో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'పెద్ది' మూవీ టీమ్‌తో కాసేపు ముచ్చటించారు.

దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అందులో బుచ్చిబాబు సానా చేసిన వ్యాఖ్యలు, వాటికి చిరంజీవి ఇచ్చిన సమాధానాలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. “సార్, నేను మీకు ‘ఉప్పెన’ కథ చెప్పాను. మీరు ఓకే చెప్పి వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ గారు నాకు ‘పెద్ది’ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఒక అవకాశం ఇస్తే మీతో సినిమా చేస్తాను” అంటూ నేరుగా అడిగాడు.

దీనికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ.. ఈ వయసులో నన్ను పరిగెత్తమని, దూకమని, రోప్స్ కట్టి పైకి కిందికి వదిలేలా పెద్ద సాహసాలు చేయమంటే నేను చేయలేను. అందుకే నీతో సినిమా చేయడం కష్టం అని అన్నారు. దాంతో బుచ్చిబాబు వెంటనే ఇప్పటికీ మీరు అలాంటివే చేస్తున్నారు కదా సార్ అని చెప్పగా, చిరంజీవి నవ్వుతూ ఇప్పటికీ రోప్స్ కడుతున్నారు.. పైకి లేపుతున్నారు.. కింద పడేస్తున్నారు.. కష్టపడుతున్నాం అని సమాధానం ఇచ్చారు. ఇలా బుచ్చిబాబు సానా నేరుగా సినిమా అవకాశం అడగడం, చిరంజీవి కూడా సరదాగా పాజిటివ్‌గా స్పందించడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Next Story