- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీఆర్ ఉంటేనే ఇవి ఈజీ.. రిటర్న్స్‌కు సమీపిస్తోన్న గడువు
చాలా మంది ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) దాఖలు చేయడాన్ని కేవలం ఒక చట్టపరమైన నిబంధనగా, పన్ను కట్టేవాళ్లకు మాత్రమే పరిమితమైన పనిగా భావిస్తారు.

దిశ, బిజినెస్ బ్యూరో: చాలా మంది ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) దాఖలు చేయడాన్ని కేవలం ఒక చట్టపరమైన నిబంధనగా, పన్ను కట్టేవాళ్లకు మాత్రమే పరిమితమైన పనిగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఐటీఆర్ అనేది మీ ఆర్థిక ప్రయాణంలో అత్యంత విలువైన ప్రక్రియ. బ్యాంక్ లోన్ల వద్ద నుంచి టాక్స్ రీఫండ్‌ల వరకు.. ఇది మీ భవిష్యత్ కు ఒక బలమైన పునాదిలా పనిచేస్తుంది. జులై 31 గడువు సమీపిస్తున్న తరుణంలో మీ ఐటీఆర్‌ను సకాలంలో దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
లోన్లు, బీమాకు కీలకం
మీరు సొంత ఇల్లు కొనాలన్నా, కొత్త కారు తీసుకోవాలన్నా లేదా పర్సనల్ లోన్ కావాలన్నా బ్యాంకులు అడిగే మొదటి డాక్యుమెంట్ ఐటీఆర్. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక అధికారిక రుజువు. అలాగే, భవిష్యత్ లో మీ కుటుంబ భద్రత కోసం భారీ మొత్తానికి ‘టర్మ్ ఇన్సూరెన్స్’ పాలసీలు తీసుకోవాలన్నా బీమా కంపెనీలు ఐటీఆర్ రికార్డులనే అడుగుతున్నాయి.
వీసా ఈజీ
మీరు ఉద్యోగం కోసమో, చదువు కోసమో లేదా సరదాగా తిరగడానికో విదేశాలకు వెళ్లాలనుకుంటే.. వీసా దరఖాస్తు ప్రక్రియలో ఐటీఆర్ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా దేశాల ఎంబసీలు మీ ఆర్థిక క్రమశిక్షణను పరీక్షించడానికి గత రెండేళ్ల ఐటీఆర్ కాపీలను పరిశీలిస్తాయి. మీ వద్ద ఈ రికార్డు ఉంటే వీసా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
రీఫండ్‌లు సులభం
మీకు వచ్చే జీతం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ లేదా ఇళ్ల అద్దె వంటి వాటిపై ఒక్కోసారి అవసరానికి మించి ముందే టాక్స్(టీడీఎస్) కట్ అవుతుంటుంది. అలా అదనంగా కట్ అయిన మీ సొంత డబ్బును ప్రభుత్వం నుండి తిరిగి(రీఫండ్) క్లెయిమ్ చేసుకోవాలంటే ఐటీఆర్ ఫైల్ చేయడం ఒక్కటే ఏకైక మార్గం. స్టాక్ మార్కెట్‌లో షేర్లు ట్రేడింగ్ చేయడం, లేదా ఏదైనా సొంత బిజినెస్ వల్ల గానీ మీకు ఈ ఏడాది నష్టాలు వచ్చాయనుకోండి.. ఆ నష్టాలను వచ్చే ఏడాది పొందే లాభాలతో అడ్జస్ట్(సర్దుబాటు) చేసుకునే సదుపాయం మన చట్టంలో ఉంది. దీనివల్ల వచ్చే ఏడాది మీరు కట్టాల్సిన పన్ను తగ్గుతుంది. అయితే, ఈ బెనిఫిట్ పొందాలంటే మాత్రం కచ్చితంగా నిర్ణీత గడువులోపు ఐటీఆర్ సబ్ మీట్ చేయాలి.
నో ఐటీ టెన్షన్!
చివరి నిమిషం వరకు వాయిదా వేయకుండా ముందే కచ్చితమైన వివరాలతో ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి నోటీసులు, అనవసర విచారణలు గానీ ఎదుర్కొనే రిస్క్ తప్పుతుంది. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది. ఐటీఆర్ అనేది కేవలం పన్ను కట్టడానికి మాత్రమే కాదు.. మీ సంపాదనకు ఒక లీగల్ రికార్డును సృష్టించుకోవడానికి ఉపయోగపడే అస్త్రం. అందుకే దీన్ని ఒక భారంగా భావించకుండా, గడువు ముగిసేలోపు పూర్తిచేయడం తెలివైన నిర్ణయమని గుర్తించుకోవడం మంచిది.






