- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొర్రెల కాపరి హత్య.. అసలు కారణం అదేనా
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రం పరిసర ప్రాంతంలో శనివారం ఓ గొర్ల కాపరి దారుణ హత్యకు గురయ్యాడు.

దిశ, గోపాల్‌పేట : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రం పరిసర ప్రాంతంలో శనివారం ఓ గొర్ల కాపరి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గోపాల్‌పేట మండల కేంద్రానికి చెందిన మందడి లక్ష్మీ వద్ద గొర్లు కాయడానికి ఏదుల మండలం మాచుపల్లి గ్రామానికి చెందిన బాలచంద్రయ్య (54) ఏడాది క్రితం జీతానికి కుదిరాడు. ఈ క్రమంలో బాలచంద్రయ్యకు గొర్ల కాపరుల కుటుంబానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని భావించిన ఆ కుటుంబ సభ్యులు అతడిని నిలదీశారు. కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి కలిసి ఇంకా ఎంతమంది కాపురాలు కూలుస్తావు అంటూ అతనితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బాలచంద్రయ్య పై కర్రలతో తీవ్రంగా దాడి చేయగా, అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గ్రామస్తుల సమాచారం మేరకు సీఐ రత్నం, గోపాల్‌పేట ఎస్సై శశిధర్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించవద్దని పట్టుబట్టారు. ఈ క్రమంలో రోడ్డుపై రాస్తారోకోకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించినప్పటికీ, తమకు న్యాయం జరిగే వరకు ఎలాంటి ఫిర్యాదు చేయబోమని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






