ఐటీలో చీకటి కోణం .. కార్పొరేట్‌లో కీచక పర్వం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-27 03:20:31  IST  )

మిరిమిట్లు గొలిపే వెలుగులు.. ఆకాశాన్నంటే భవనాలు.. రూ.వేల కోట్ల టర్నోవర్‌తో దేశానికే తలమానికంగా నిలిచే భాగ్యనగర ఐటీ కారిడార్‌లో చీకటి కోణాలు భయపెడుతున్నాయి.

ఐటీలో చీకటి కోణం .. కార్పొరేట్‌లో కీచక పర్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మిరిమిట్లు గొలిపే వెలుగులు.. ఆకాశాన్నంటే భవనాలు.. రూ.వేల కోట్ల టర్నోవర్‌తో దేశానికే తలమానికంగా నిలిచే భాగ్యనగర ఐటీ కారిడార్‌లో చీకటి కోణాలు భయపెడుతున్నాయి. ఏసీ గదుల్లో సాగే నిశ్శబ్ధ పని వాతావరణం వెనుక మహిళా ఉద్యోగినుల కన్నీటి గాథలు కట్టలు తెంచుకుంటున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ జరిపిన పరిశీలనలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కేవలం 12 శాతం కార్యాలయాల్లోనే అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉన్నట్లు తేలింది. తాజాగా హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో మహిళా ఐపీఎస్‌ ట్రైనీపై జరిగిన వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

వెకిలి చేష్టలతో నిత్యం నరకం

నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే ఓ యువతి ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఆఫీసులో ఎంతో చురుగ్గా ఉండే ఆమె, సహోద్యోగి చేస్తున్న వేధింపులతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. వ్యంగ్య వ్యాఖ్యలు, వెకిలి చేష్టలతో నిత్యం నరకం చూపిస్తున్నాడని తన స్నేహితురాలి వద్ద కన్నీరుమున్నీరైంది. ఆ స్నేహితురాలు చొరవ తీసుకుని వెంటనే షీ టీమ్స్‌‌ను ఆశ్రయించడంతో సదరు కీచకుడికి చెక్ పడింది. తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి కార్యాలయంలోనే ఒక వేదిక ఉండాలని చట్టం చెబుతున్నా, యాజమాన్యాల బాధ్యతారాహిత్యం వల్ల లక్షలాది మంది మహిళలు మౌనంగా భరిస్తున్నారు.

అంతర్గత కమిటీలు

కార్పొరేట్ కొలువుల్లో వేధింపులకు సంబంధించి ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైవేటు కంపెనీల్లో జరిగే వేధింపులు, ఉద్యోగ వివాదాలు, పనితీరు అంచనా వంటివి యజమాని, ఉద్యోగికి మధ్య ఉండే అంతర్గత సంబంధాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆరోపణలు తీవ్రమైనవన్న కారణంగా పరిధి లేకుండా ఫిర్యాదులను స్వీకరించరాదని పేర్కొన్న ధర్మాసనం, బాధితులు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సంబంధిత సంస్థలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని సూచించింది. చట్టం ప్రకారం ప్రతి సంస్థలో అంతర్గత కమిటీలు ఉండాలని కోర్టు గుర్తుచేసింది.

షీ బాక్స్‌‌పై అవగాహన ఏదీ

నిజానికి మహిళల భద్రత కోసం 2013లో కేంద్ర ప్రభుత్వం పోష్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తే, వెంటనే అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. అయితే, తెలంగాణలోని 88 శాతం సంస్థలు ఈ నిబంధనను తుంగలో తొక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ బాక్స్‌ అనే ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్‌ గురించి సరైన ప్రచారం లేకపోవడం వల్ల అది బాధితులకు చేరువ కావట్లేదు.

ఫిర్యాదుల కమిటీలు ఉండాలి

బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 86 షీ టీమ్స్‌ ఉండగా, వాటిలో 375 మంది సిబ్బంది ఉన్నారు. వీరు 2025 జూన్‌ నుంచి 2026 జూన్ వరకు 983 మంది ఆకతాయిలను నేరుగా పట్టుకున్నారు. 993 కేసులు నమోదు కాగా, బాధితుల నుంచి మొత్తం 6,855 ఫిర్యాదులు అందాయి. రోడ్లపై పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నా, నాలుగు గోడల మధ్య ఆఫీసుల్లో సాగే వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో వ్యవస్థ విఫలమవుతోంది. కమిటీల ఏర్పాటుపై కార్మిక శాఖ, ఐటీ శాఖలు గట్టిగా పర్యవేక్షించకపోవడం నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రతి సంస్థలో ఫిర్యాదుల కమిటీలు ఉండేలా చూడటంతో పాటు, బాధ్యులపై కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా లోకం కోరుతోంది.

వందల సంఖ్యలో ఫిర్యాదులు

మహిళా ఉద్యోగినుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం సాహస్‌ వంటి కార్యక్రమాలు చేపట్టినా, క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా నగరంలోని ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళల కోసం ఈ ఏడాది మేలో ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అనే ఆన్‌లైన్ వేదికను ప్రారంభించారు. ఇది ప్రారంభమైన కేవలం రెండు వారాల వ్యవధిలోనే వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తడం ఇప్పటి ఇంకా ఫిర్యాదులు రావడం గమనార్హం. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఆఫీసు గోడల మధ్య కీచక పర్వం సాగుతూనే ఉంది.

Next Story