తమిళనాడు, బెంగాల్ ఎన్నికల కోసమే మహిళా రిజర్వేషన్ డ్రామా : ఎర్రబెల్లి స్వర్ణ

by Ramesh Naini |

బీజేపీ కేవలం తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ మహిళా బిల్లును 16వ తేదీన తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు.

తమిళనాడు, బెంగాల్ ఎన్నికల కోసమే మహిళా రిజర్వేషన్ డ్రామా : ఎర్రబెల్లి స్వర్ణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ కేవలం తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ మహిళా బిల్లును 16వ తేదీన తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. సోమవారం ఆమె గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చట్టం ప్రకారం, జనగణన, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ అమలు 2034 తర్వాత జరిగే అవకాశం ఉందని, బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును 10 సంవత్సరాల క్రితమే అమలు చేయాల్సి ఉన్నా కూడా ఎందుకు చేయలేదు? ఆమె ప్రశ్నించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పుడు మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చిందని, బీజేపీ ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి.. ఎన్నికల లబ్ధి కోసమే ఆడుతున్న హైడ్రామా ఇదంతా అని ఎర్రబెల్లి స్వర్ణ మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ అమలు కోసం 40 సంవత్సరాల క్రితమే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే మహిళా రిజర్వేషన్‌ను పార్లమెంట్‌లో అమలు చేయాలని చర్చ ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా నాయకత్వంలో పార్లమెంట్ కమిటీ వేశారని, 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. 2013లో సోనియా గాంధీ సూచన మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ఆమోదం పొందలేదన్నారు. ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీలకు కూడా ఈ రిజర్వేషన్‌లో వాటా ఇవ్వాలని, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ఎర్రబెల్లి స్వర్ణ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ కూడా గందరగోళంగా ఉందని, సగటుగా 50% సీట్లు పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది వాస్తవమన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని ఎర్రబెల్లి స్వర్ణ అభిప్రాయపడ్డారు.

Next Story