TG: ల‌క్షమంది మ‌హిళ‌ల‌తో మ‌హిళా దినోత్సవం

by Gantepaka Srikanth |

అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని శ‌నివారం ప‌రేడ్ గ్రౌండ్ వేదిక‌గా మ‌హిళా స‌ద‌స్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

TG: ల‌క్షమంది మ‌హిళ‌ల‌తో మ‌హిళా దినోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని శ‌నివారం ప‌రేడ్ గ్రౌండ్ వేదిక‌గా మ‌హిళా స‌ద‌స్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క ఆధ్యక్షత‌న స‌భ జ‌ర‌గనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.. స‌భా వేదిక‌గా ల‌క్ష మంది మ‌హిళ‌ల స‌మ‌క్షంలో ఇందిరా మ‌హిళా శ‌క్తి మిష‌న్-2025 ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్‌లో మ‌హిళా సంఘాలు ఈ ఏడాది సాధించిన విజ‌యాల‌తో పాటు, మ‌హిళా సాధికార‌త బ‌లోపేతం కోసం ప్రభుత్వం త‌ల‌పెట్టిన కార్యక్రమాలను పొందు ప‌రిచారు. 32 జిల్లాల నుంచి మ‌హిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వ‌చ్చే అవ‌కాశాలుండ‌టంతో పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మ‌హిళా స‌భ్యుల‌ను స‌భ‌కు ఆహ్వనిస్తూ మంత్రి సీత‌క్క స్వయంగా జిల్లా మ‌హిళా స‌మాఖ్యల‌కు ఆహ్వానాలు పంపారు. దూర ప్రాంతాల నుంచి వ‌స్తున్న మహిళలకు ఆలస్యం కాకుండా ఏడున్నర‌ గంట‌ల లోపు స‌భ‌ను ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స‌భ ఏర్పాట్లపై మంత్రి సీత‌క్క శుక్రవారం పరేడ్ గ్రౌండ్‌ను సంద‌ర్శించి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.

పూర్తయిన ఏర్పాట్లు:

జిల్లాల నుంచి వ‌చ్చే మ‌హిళ‌ల కోసం 600 కు పైగా ఆర్టీసీ బస్సుల‌ను సెర్ప్ అందుబాటులో ఉంచింది. దీంతో పాటు జిల్లాకొక అధికారిని నియ‌మించి బాధ్యతల అప్పగించింది. మ‌హిళ‌లు ఇంటి నుంచి బ‌య‌లు దేరినప్పటి నుంచి ఇంటికి సుర‌క్షితంగా చేరుకునే వర‌కు ఈ అధికారులు స‌మ‌న్వయం చేస్తారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల స‌దుపాయాల‌ను క‌ల్పించారు. సాయంత్రం ఐదు గంట‌ల‌కు స‌భ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో మ‌హిళ‌లంతా అర‌గంట ముందే స‌భా స్థలికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. స‌భ‌కు వ‌చ్చే మ‌హిళ‌ల‌కు ఏలాంటి అసౌక‌ర్యం జ‌ర‌క్కుండా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి అధికారులకు సూచించారు. తాగునీరు, విద్యుత్ నిరంత‌రాయంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. స‌చివాల‌యంలో జిల్లా డీఆర్డీఏ, జిల్లా మ‌హిళా స‌మాఖ్య స‌భ్యుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేస‌వి కాల‌మైనందున జాగ్రత్తలు పాటించాల‌ని కోరారు. వాట‌ర్ బాటిల్స్, ట‌వ‌ల్స్ ప్రతి ఒక్కరి వ‌ద్ద ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు.

Next Story