Women's Commission: మహిళా కమిషన్‌పై సర్కార్ చిన్నచూపు.. నిధులు కరువు

by Kema Shiva Kumar |

మహిళా కమిషన్ కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది.

Womens Commission: మహిళా కమిషన్‌పై సర్కార్ చిన్నచూపు.. నిధులు కరువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా కమిషన్ కార్యకలాపాలకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది. తమ పరిస్థితి ‘పదవులు ఇచ్చి కాళ్లు చేతులు కట్టేసిన చందంగా’ ఉందని కమిషన్‌లో కీలక హోదాలో ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ కేటాయించాలని కోరినా ఇవ్వడం లేదని, యాక్టివిటీస్ కోసం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని కమిషన్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తు్న్నాయి. ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికీ మార్పు రాకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని ఆ కమిషన్‌లో కీలక హోదాలోని వ్యక్తులు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వరా?

మహిళలకు న్యాయం జరగాలని పదవులు ఇచ్చిన ప్రభుత్వం.. పనిచేసేందుకు మాత్రం సపోర్టింగ్ సిబ్బందిని ఇవ్వడం లేదని కమిషన్ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ విషయంపై ఎన్ని సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందని, సర్కారులోని కీలక వ్యక్తులను కలిసి వివరించినా స్పందన కరువైందని ఆరోపిస్తున్నాయి. ‘సిబ్బంది ఇవ్వకుండా.. నిధులు లేకుండా ఏం పని చేయాలి? ఇతర రాష్ట్రాల్లోని ఉమెన్ కమిషన్‌లో 20 నుంచి 30 మంది సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ కనీసం10 మందిని కూడా ఇవ్వట్లేదు. ఒక్కరిని మాత్రమే ఇచ్చారు. ఆ అధికారి సైతం పూర్తి స్థాయిలో కాకుండా ఇన్‌చార్జిగా అపాయింట్ చేశారు’ అని కొందరు వాపోయారు. కమిషన్‌కు రోజుకు వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిపై విచారణ చేసి కొన్నిసార్లు ఫీల్డ్ విజిట్ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే తాము ఎలా పనిచేయగలమని కమిషన్ వర్గాలు ప్రభుత్వంలోని పెద్దలను ప్రశ్నిస్తున్నాయి.

రాజీనామా చేస్తాం!

వేతనాల కోసం లేఖల మీద లేఖలు రాయగా ఈ మధ్యే విడుదల చేశారని కమిషన్ సిబ్బందిని పేర్కొన్నారు. ఈ పదవిని అనవసరంగా తీసుకున్నామని అందులోని కీలక వ్యక్తులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం తీరులో మార్పు రాకపోతే తమ పదవికి రాజీనామా చేస్తామని కొందరు మంత్రుల వద్ద ఓపెన్ అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో చైర్ పర్సన్ పోస్టుకు కేబినెట్ ర్యాంక్ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఆ హోదాను తొలగించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.

ఓపిక పట్టాలి: ప్రభుత్వ వర్గాలు

ఆర్థిక వనరుల కొరత వల్లే కమిషన్‌కు జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే, కమిషన్ అవసరాలను గుర్తించి, స్టాఫ్‌ను కేటాయించేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు ఓపికతో ఉండాలని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘ఇష్టం ఉన్నట్లు నిధులు అడిగితే ఇవ్వడం కుదరదు. అవసరం మేరకు కేటాయిస్తాం’ అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Next Story