మహిళా బిల్లు వెంటనే అమలు చేయాలి.. అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్

by Ramesh Naini |

చట్టంగా మారిన మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చిందని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించాయి.

మహిళా బిల్లు వెంటనే అమలు చేయాలి.. అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: చట్టంగా మారిన మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్లమెంట్‌ ముందుకు తీసుకొచ్చిందని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. మహిళా బిల్లును ప్రత్యేకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, మహిళా రిజర్వేషన్‌లు అమలులోకి తేవాలని, తెలంగాణపై విద్వేషపూరితంగా పార్లమెంట్‌లో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, తెలంగాణ సమాజానికి బీజేపీ క్షమాపణ చేప్పాలని సమావేశం డిమాండ్‌ చేసింది. డీలిమిటేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోయేలా సమర్థవంతంగా వ్యవహరించిన ఇండియా కూటమిని వక్తలు అభినందించారు. ‘సమాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీలిమిటేషన్‌' అనే అంశంపై తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌‌లోని దేశోద్ధారక భవన్‌లో కన్వీనర్‌ కరుణాకర్‌ దేశాయి అధ్యక్షతన శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్ర, కుతంత్రంతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లును కలిపి ప్రవేశపెట్టిందని విమర్శించారు. డీలిమిటేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోవడం ఇండియా కూటమి ప్రజాస్వామిక ఘన విజయమన్నారు. పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండానే మహిళా బిల్లుతో గెలుస్తామని కుట్ర పూరితంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు అందరం అనుకూలమేనని, మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్‌ బిల్లు తెచ్చినందుకు వ్యతిరేకించామని స్పష్టం చేశారు. రాజకీయ అవసరాల కోసం ఎత్తుగడగా మహిళా బిల్లును బీజేపీ వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పాటుపై అవహేళన..

మహిళా బిల్లును వెంటనే తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ కూడా గతంలో అన్యాయంగా వ్యాఖ్యలు చేశారన్నారు. అన్ని రాష్ట్రాల విభజన జరిగిన విధానాలనే తెలంగాణ విభజన విషయంలో పాటించారని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కాార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మెజారిటీ ఉందని బీజేపీ, ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజలు, కార్మికులకు వ్యతిరేకమైన అనేక బిల్లులు తీసుకొచ్చిందని విమర్శించారు. తనకు బలమైన ప్రాంతాలుగా ఉన్న రాష్ట్రాలలో సీట్లు పెంచుకునేందుకు బీజేపీ డీలిమిటేషన్‌ బిల్లు తెచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించారని, దేశ విభజనకు ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమనే విషయం తేజస్వీ సూర్య తెలుసుకోవాలన్నారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. దక్షిణాదికి 24 శాతం సీట్లు ఉంటే వాటిని 20 శాతానికి తగ్గించేందుకు డీలిమిటేషన్‌ కుట్రతో తీసుకొచ్చారని మండిపడ్డారు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు. సీపీఐఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర నాయకులు కె.గోవర్దన్‌ మాట్లాడుతూ.. దక్షాణాది రాష్ట్రాలను రెండో తరగతికి దిగజార్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఆమోదం పొందిన బిల్లును మరోసారి తీసుకరావడం అవివేకమన్నారు. వందలాది మంది ప్రాణాత్యాగాలతో తెలంగాణ వచ్చిందని, తేజస్వి సూర్య వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విమలక్క మాట్లాడుతూ, ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్‌ బిల్లు తీసుకొచ్చిందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నర్సింహ, కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్‌.బోస్‌, కాంగ్రెస్‌ నాయకులు లూబ్నా సర్వత్‌, రాజలింగం, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి స్టాలిన్‌ పాల్గొన్నారు.

Next Story