పేటీఎం మనీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్.. రూ.51 లక్షలు స్వాహా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-23 13:30:01  IST  )

సైనిక్ పురికి చెందిన సురేష్ దాది భార్య.. దుర్గా దాది సెప్టెంబర్ 20వ తేదీన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైంది. అక్కడ శివకృష్ణ అనే వ్యక్తిని కలవగా..

పేటీఎం మనీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్.. రూ.51 లక్షలు స్వాహా
X

దిశ, వెబ్‌డెస్క్: పేటీఎంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని, తాను కూడా ఆ విధంగానే లాభం పొందుతున్నానని ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన గృహిణి.. నిండా మునిగింది. అతని మాటలు నమ్మి పలు దఫాలుగా రూ.51.1 లక్షలు పెట్టుబడిగా ఇచ్చిన ఆమె.. కొద్దిరోజులకు తాను మోసపోయానని గ్రహించి నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్ పురికి చెందిన సురేష్ దాది భార్య.. దుర్గా దాది సెప్టెంబర్ 20వ తేదీన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైంది. అక్కడ శివకృష్ణ అనే వ్యక్తిని కలవగా.. అతను పేటీఎం మనీలో పెట్టుబడి ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. తాను రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా రూ.30 లక్షలు సంపాదించానని తెలిపాడు. ఆమెను కూడా అదే ప్లాట్ ఫామ్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్రోత్సహించాడు. శివకృష్ణ మాటలను గుడ్డిగా నమ్మిన దుర్గ..వాట్సప్ లో అతడిని కాంటాక్ట్ అయింది.

వాట్సాప్ లో తనకు వచ్చిన రిఫెరల్ లింక్ ద్వారా.. ఫేక్ పేటీఎం మనీ గ్రూప్ లో చేరింది. అందులో ఉన్న మెంబర్స్ ఆమె పర్సనల్ వివరాలు, బ్యాంకింగ్ డీటెయిల్స్ తో https://dukcjkh.com లో రిజిస్టర్ అవ్వాలని చెప్పారు. తొలుత మూడున్నర లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టగా.. రూ.40వేలు లాభం పొందింది. దాంతో అది ఫేక్ కాదని గుడ్డిగా నమ్మేసింది. ఆ తర్వాత గ్రూప్ ఆమెను ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) స్కీమ్ లో రూ.46.9 లక్షలు పెట్టుబడి పెట్టాలని కన్విన్స్ చేసింది. ఇందుకు QIB రూ.40 లక్షలు లోన్ ఇస్తుందని చెప్పారు.

అంతా ఆ గ్రూపులో మెంబర్స్ చెప్పినట్లుగా చేసిన తర్వాత.. రూ.1.3 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు కనిపించింది. ఆ అమౌంట్ ను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. కేటుగాళ్లు ముందుగా లోన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.1.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయగా ఆమె అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఇలా మొత్తంగా రూ.51.5 లక్షల విలువైన లావాదేవీలు చేయగా కేవలం రూ.40 వేలు మాత్రమే రావడంతో.. తాను మోసపోయానని గ్రహించింది. నిందితులపై ఫిర్యాదు చేసిన దుర్గ.. వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసిన నేరేడ్ మెట్ పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి మాయమాటలు నమ్మి ఈజీ మనీ ట్రాప్ లో పడి ఉన్నది కూడా పోగొట్టుకోవద్దని పోలీసులు సూచించారు.

Next Story