పర్యావరణ పరిరక్షణలో మహిళలు..‘అమ్మ పేరిట మొక్క’ పథకంలో 50లక్షలు మొక్కలు

by Ajay Maddhiboyina |

పట్టణ కేంద్రాల్లో గ్రీనరీ పెంచడం, ఉష్ణోగ్రత తగ్గింపు, కాలుష్య నియంత్రణ, స్వయం సహాయక సంఘాల్లో మహిళల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పర్యావరణ పరిరక్షణలో మహిళలు..‘అమ్మ పేరిట మొక్క’ పథకంలో 50లక్షలు మొక్కలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణ కేంద్రాల్లో గ్రీనరీ పెంచడం, ఉష్ణోగ్రత తగ్గింపు, కాలుష్య నియంత్రణ, స్వయం సహాయక సంఘాల్లో మహిళల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)కు ఈ బాధ్యతలను అప్పగించింది. అమృత్ 2.0, తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్ఐడీసీ) కలిసి చేపట్టిన పథకంలో భాగంగా అమృత్ మిత్రల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాటీల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘అమ్మ పేరిట ఒక మొక్క’ పథకంలో భాగంగా మొక్కలను నాటడం వాటిని పరిరక్షించే బాధ్యతను ‘ఉమెన్ ఫర్ ట్రీ’ పేరుతో అప్పగించడం, వీటి ద్వరా మహిళలకు ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మెప్మా నిర్ణయించింది.

50లక్షల మొక్కలు..

అమృత మిత్రల ఆధ్వర్యంలో రెండో దశలో 50లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. మొదటి దశ మే 21 నుంచి 23వ తేదీల్లో మున్సిపాలిటీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు సంయుక్తంగా పార్కులు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులకు సంబంధించిన ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించాలని మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. రెండో దశ జూన్ 5(జాతీయ పర్యావరణ దినోత్సవం) నుంచి ఆగస్టు 31 వరకు భారీ స్థాయిలో 50లక్షలు మొక్కలు నాటాలని నిర్ణయించారు.

పరిరక్షణలోనూ..

‘అమ్మ పేరిట ఒక మొక్క’ పథకంలో భాగంగా మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన చెరువులు, కుంటలు, నాలాలు, కాల్వలు కాపాడే కార్యక్రమంలో భాగంగానే ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఉమెన్ ఫర్ ట్రీ’ పేరుతో పరిరక్షించే బాధ్యతలను మహిళలకు అప్పగించారు.

రూ.20కోట్ల నిధులు..

సీడీఎంఏ పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అమృత మిత్ర కార్యక్రమంలో భాగంగా పార్కుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ పథకం రాష్ట్రంలో అమలవుతోంది. దీంతోపాటు 50లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) ద్వారా ఖర్చు చేయనుంది.

Next Story