MLC Elections: 3 స్థానాలు.. 90 మంది అభ్యర్థులు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మొత్తం మూడు స్థానాలకు గాను 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

MLC Elections: 3 స్థానాలు.. 90 మంది అభ్యర్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. మొత్తం మూడు స్థానాలకు గాను 90 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సోమవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియగా.. గురువారం విత్ డ్రా గడువు పూర్తయింది. దీంతో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి 12 మంది విత్ డ్రా చేసుకోగా.. 56 మంది పోటీలో నిలిచారు. అలాగే.. టీచర్ల స్థానానికి ఒకరు విత్ డ్రా చేసుకోగా.. 15 మంది పోటీపడుతున్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. ఈ స్థానానికి 19 మంది పోటీ పడుతున్నారు.

ఉధృతం కానున్న పోరు

ఎట్టకేలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తమ జిల్లాల పరిధిలోని ఓటర్లను కలుసుకున్న అభ్యర్థులు.. మరోసారి వారిని ప్రసన్నం చేసుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారానికి కీలక నేతలను ఆహ్వానించి తమ సత్తాచాటాలని చూస్తున్నారు. ఎలా అయినా గెలవాలనే లక్ష్యంతో ఆయా పార్టీలు సైతం ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నాయి. ఉన్న కాస్త సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. అలాగే.. పార్లమెంట్ సమావేశాలు ముగియడం, స్థానిక ఎన్నికలు సైతం వాయిదా పడడంతో ప్రచారం మరింత జోరందుకోనుంది. రాష్ట్ర స్థాయి నాయకులంతా ఎన్నికలు ఉన్న జిల్లాల్లో మకాం వేసేందుకు సిద్ధం అయ్యారు.

Next Story