ఒక్క డీఏతో చేతులు దులుపుకుంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శ

by Ramesh Naini |

రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు.

ఒక్క డీఏతో చేతులు దులుపుకుంటారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఒక్క డీఏతో చేతులు దులుపుకుంటున్నారా..? అని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో సీఎంను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగులపై ఇంతటి నిర్లక్ష్యం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉంటే, కేవలం ఒక్క డీఏ ప్రకటించడం అంటే ఉద్యోగులను వంచించడమేనని పేర్కొన్నారు.

పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఉద్యోగ విరమణ చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రి ఖర్చులకు సైతం డబ్బులు లేక బాధపడుతుంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ కేవలం కాలయాపన చేస్తూ పీఆర్సీ‌ని సైతం గాలికి వదిలేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కొత్త పీఆర్సీని ప్రకటించి, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఫిట్‌మెంట్ శాతానికి ఏ మాత్రం తగ్గకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ లోపల, బయట పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story