రూ.50 లక్షలిస్తవా.. 20 ఏళ్లు జైల్లోనా? బాండ్‌పేపర్‌పై రాజ్‌కుమార్ సూసైడ్ నోట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-13 16:12:47  IST  )

షాబాద్ ఆరుగురి మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ రాసిన 4 పేజీల బాండ్ పేపర్ సూసైడ్ నోట్ లభ్యమైంది.

రూ.50 లక్షలిస్తవా.. 20 ఏళ్లు జైల్లోనా? బాండ్‌పేపర్‌పై రాజ్‌కుమార్ సూసైడ్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో జరిగిన ఆరుగురి మర్డర్ కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హత్యలకు ముందు నిందితుడు రాజ్‌కుమార్‌ తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డు చేయడంతో పాటు ఏకంగా బాండ్‌పేపర్లపై నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో తన చావుకు నలుగురు కారణమని అతడు వెల్లడించాడు. ఈ మేరకు ఆ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్‌లో ఏముందంటే..?

తన స్వగ్రామమైన దైవాలగూడలో తన ఇంటి పక్కనే ఉన్న అక్షయ అనే అమ్మాయి తన వెంట పడిందని రాజ్‌కుమార్ తెలిపాడు. తనను లవ్ చేస్తున్నానని.. వేధించి, వెంబడించిందని, తాను లేకపోతే చచ్చిపోతానని బెదిరించిందని పేర్కొన్నాడు. అప్పటికే తనకు పెళ్లై ఒక కొడుకు ఉన్నా.. ఆమె ప్రేమను అంగీకరించానని తెలిపాడు. అక్షయ వాళ్ల నాన్న బతికున్నంత వరకు అంతా బాగానే ఉందని అన్నాడు. ఆ తర్వాత తమ విషయం అమ్మాయి వాళ్ల నానమ్మ రుక్కమ్మకు తెలిసిందని, ఆమె ఈ విషయాన్ని అక్షయ వాళ్ల అమ్మకు చెప్పిందని రాజ్‌కుమార్ వెల్లడించాడు.

నీ ఇజ్జత్ తీస్తాం..

కొన్నాళ్లకు ఓ రోజు రాత్రి 11.30 గంటల సమయంలో అక్షయ తనకు మెసేజ్ చేసిందని.. ‘నేను రాను అంటే టాబ్లెట్లు మింగి చస్తాను’ అని బెదిరించడంతో వాళ్ల ఇంటికి వెళ్లానని తెలిపాడు. అదే సమయంలో తాము కలవడాన్ని చూసిన వాళ్ల నానమ్మ, అమ్మ.. ‘నీ ఇజ్జత్ తీస్తాం, ఈ విషయం నీ భార్యకు కూడా చెబుతాం’ అని బెదిరించారని రాజ్‌కుమార్ తెలిపాడు. ఆర్థికంగా వెనకబడి ఉన్న అక్షయ కుటుంబం తనను బెదిరించిందని, డబ్బులిస్తేనే విషయం బయటపెట్టమని, లేకపోతే కేసులు పెడతామని బ్లాక్‌మెయిల్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. దాంతో తాను భయపడి వారు అడిగినప్పుడల్లా రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు ఇస్తూ వచ్చానని రాజ్‌కుమార్ పేర్కొన్నాడు.

సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా..

వారి టార్చర్ భరించలేక తాను ఈ విషయం అక్షయ వాళ్ల నాన్నకు చెప్పేందుకు సిద్ధమయ్యానని, ఆ తర్వాత వాళ్లు కాస్త వెనక్కి తగ్గి చెప్పొద్దని వేడుకున్నారని రాజ్‌కుమార్ తెలిపాడు. అప్పటివరకు అక్షయ తనతో మాట్లాడకుండా సెల్‌ఫోన్ లాక్కున్నారని, విషయం వాళ్ల నాన్నకు చెబుతా అన్నాకే సెల్‌ఫోన్ ఇచ్చారని పేర్కొన్నాడు. కొన్నాళ్లకు అక్షయ వాళ్ల నాన్న చనిపోయాడని, ఆ తర్వాత తమ విషయం వాళ్ల చుట్టాలకు తెలిసిందన్నాడు. ‘అమ్మాయి జోలికొస్తే మీరెలా ఊరుకున్నారు?’ అని అక్షయ తరఫు బంధువులు వాళ్లను రెచ్చగొట్టారని.. అప్పటి నుంచి తమ మధ్య గొడవలు మొదలయ్యాయని, తనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని చెప్పుకొచ్చాడు. ఇక అక్షయ టార్చర్ తట్టుకోలేకపోయానని, గతంలో సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానని, ఎలాగైనా సొంతూరు వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యానని తెలిపాడు. ఈ సూసైడ్ విషయం తన భార్యకు కూడా తెలిసిందన్నాడు. అక్షయ వాళ్ల నాన్నకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా తానే డబ్బులు పెట్టి ట్రీట్‌మెంట్ చేయించానని, అయినా ఆయన చనిపోయాడని తెలిపాడు.

నాపై అన్యాయంగా ‘పోక్సో’ కేసు..

చివరగా అక్షయ కాలేజీకి వెళ్తున్న క్రమంలో తాను గతంలో ఆమెకు ఇచ్చిన సెల్‌ఫోన్‌ను తిరిగి తీసుకునేందుకు శంషాబాద్ వెళ్లానని రాజ్‌కుమార్ తెలిపాడు. అప్పుడు వాళ్ల అమ్మ కూడా ఆమెతో వచ్చిందన్నాడు. ‘నువ్వు భూమి అమ్మావని.. డబ్బులు కూడా బాగానే వచ్చాయని మాకు తెలిసింది’ అని అక్షయ వాళ్ల అమ్మ తనతో చెప్పిందన్నాడు. ‘మేము పేదోళ్లం, సాయంత్రానికి ఎలాగైనా డబ్బు అరేంజ్ చేయ్’ అని తన వెంటపడ్డారని రాజ్‌కుమార్ వెల్లడించాడు. తాను డబ్బులిచ్చేందుకు ఒప్పుకోకపోతే.. ‘నా కూతురి వెంట పడ్డావు’ అని అన్యాయంగా తనపై పోక్సో (POCSO) కేసు పెట్టించారని తెలిపాడు. చివరకు బెయిల్‌పై బయటకు వచ్చినా వారు తనను వదిలిపెట్టలేదని.. "రూ.50 లక్షలు ఇస్తావా.. లేక 20 ఏళ్లు జైల్లో ఉంటావా?" అని అనుక్షణం బెదిరింపులకు గురి చేశారని రాజ్‌కుమార్ తాను స్వహస్తాలతో రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

Next Story