- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రలోభాలతో ఓట్లు పడేనా? BRSలో కాంగ్రెస్ వేవ్ టెన్షన్..!
పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే గడువు ఉంది.

దిశ, తెలంగాణ బ్యూరో : పోలింగ్‌కు ఒకరోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఓటర్లకు ప్రలోభాలు షురూ అయ్యాయి. విపక్ష అభ్యర్థులు ఇచ్చే దానికంటే ఎక్కువగా ఇచ్చేందుకు బీఆర్ఎస్ సైతం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చినా ఓటు కారుకు వేస్తారా లేదా? అనే సందిగ్ధం నేతల్లో నెలకొంది. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొద్దనేది తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికే ఓటర్లకు స్థానిక నేతలతో ఫోన్లు చేయడంతో పాటు నగదు రహిత బదిలీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పెన్షన్ దారులు, రైతులపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది.
ఇచ్చినా కారుకు వేస్తారా?
ఇప్పటివరకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్‌కు మైలేజ్ రాలేదు. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రజలు సమస్యలపై నిలదీశారు. మౌలిక సమస్యలు ఏళ్లతరబడి పరిష్కారం కాలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనర్హులకు ఇచ్చారని ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందనే మౌత్ టాక్ విస్తృతంగా గ్రామాల్లో ఉంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ ప్రజలను ఆకర్షించేందుకు, పక్కా ప్రణాళికతో పోల్ మేనేజ్‌మెంట్ చేయాలని భావిస్తుంది. ఓటర్ల లిస్టువారిగా ఎవరు కారుకు ఓటువేస్తారనేది స్థానిక నేతలు ఆరా తీస్తున్నారు. గ్రామంలోనే ఉన్నారా? ఇతర ప్రాంతాల్లో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క ఇంటిలో ఎంతమంది బీఆర్ఎస్‌కు అనుకూలమనే వివరాలు సేకరిస్తున్నారు.
బీఆర్ఎస్ నేతల మల్లగుల్లాలు..
గ్రామాల్లో ఓటర్ల ఎంపికపై గులాబీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమే, ఎవరు కాదో తెలియడం లేదు. గతంలో ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ అని చెప్పేవారు. సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు వచ్చినా ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడతాయనేది స్పష్టంగా తెలిసేది. కానీ ప్రస్తుత తరుణంలో ఉదయం ఒకపార్టీ... సాయంత్రం మరోపార్టీలో నేతలు మారుతున్న విధంగానే ప్రజలు సైతం మారుతున్నారు. దీంతో గ్రామాల్లో ఎవరు ఏపార్టీ అనేది స్పష్టత కరువైంది. దీంతో గులాబీ నేతలు ఎవరికి నగదు రహిత బదిలీ చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
ఆశలన్నీ వారిపైనే..
బీఆర్ఎస్ పార్టీ పెన్షన్ లబ్ధిదారులు, రైతులపైనే ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో పెన్షన్ దారులు సుమారు 40లక్షల మంది ఉండగా, రైతులు 70 లక్షల మంది ఉన్నారు. వికలాంగులకు రూ. 4,106, ఆసరా పెన్షన్ దారులకు రూ. 2016 చొప్పున ఇస్తున్నారు. రైతులకు బీమా, రైతుబంధు, రుణమాఫీ చేస్తుండటంతో వారంతా బీఆర్ఎస్‌కు ఓటువేస్తారనే ఆశతో ఉన్నారు. అయితే రైతుబంధు పడకపోవడం, రుణమాఫీ పూర్తిస్థాయిలో కాకపోవడంతో రైతులు కొంత అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పెన్షన్‌తో పాటు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని హామీ ఇవ్వడంతో అటు మొగ్గువైపు చూపే అవకాశం ఉందని బీఆర్ఎస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
స్థానిక నేతలతో ఇప్పటికే ఫోన్లు...
ప్రచార సమయంలో స్థానిక ఓటర్లు కలువకపోయినా... ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు స్థానిక నేతలతో ఫోన్లు చేయిస్తున్నారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో మరోదఫా ఫోన్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు ఓటువేయాలని కోరడంతో పాటు నగదు బదిలీకి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి నుంచి స్టార్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయాచోట్ల పార్టీల పరిస్థితి, కాంపిటీషన్‌ను బట్టి నగదు బదిలీ చేస్తున్నట్లు సమాచారం.






